కాన్బెర్రా: వైద్య నిపుణులే విస్మయం చెందే ఘటన ఆస్ట్రేలియాలో వెలుగుచూసింది. ఓ 64 ఏండ్ల వృద్ధురాలి మెదడులో కదులుతున్న ఏలికపామును చూసి వైద్యులు షాక్కు గురయ్యారు. ఇది ప్రపంచంలోనే మొదటి కేసని వెల్లడించారు. న్యూసౌత్ వేల్స్కు చెందిన ఓ వృద్ధురాలు మతిమరుపు, డిప్రెషన్ లక్షణాలతో కాన్బెర్రా దవాఖానలో చేరింది.
ఆమె మెదడులో 8 సెంటీమీటర్ల పొడవున్న ఏలికపాము ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఇది ఒక ప్రత్యేక రకమైన రౌండ్ వార్మ్ అని, మహిళ తిన్న కూరగాయలపై ఉన్న గుడ్ల ద్వారా ఇది మెదడులోకి చేరి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మెదడుకు శస్త్రచికిత్స చేసి ఆ జీవిని బయటకు తీశారు.