బీజింగ్: అమెరికా, చైనా మధ్య సుంకాల యుద్ధం(Trade War) నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ నుంచి విమానాలను ఖరీదు చేయవద్దు అని తమ ఎయిర్లైన్స్ సంస్థలకు చైనా చెప్పింది. రెండు దేశాల మధ్య వాణిజ్య అగాధం ఏర్పడడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విదేశీ వస్తువులపై అధిక స్థాయిలో సుంకాలు వసూల్ చేస్తున్న విషయం తెలిసిందే. చైనా దిగుమతులపై సుమారు 145 శాతం సుంకాలు వసూల్ చేసేందుకు ట్రంప్ సర్కారు నిర్ణయించింది.
అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని డ్రాగన్ దేశం తీవ్రంగా ఆక్షేపించింది. అగ్రరాజ్యం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు చైనా పేర్కొన్నది. దీంతో ప్రతీకారంగా అమెరికా వస్తువులపై 125 శాతం సుంకాన్ని వసూల్ చేసేందుకు నిర్ణయించింది. అమెరికా కంపెనీ నుంచి విమాన పరికరాలు, విడిభాగాల కొనుగోలును నిలిపివేయాలని ఎయిర్లైన్స్ సంస్థలకు చైనా ఆదేశాలు జారీ చేసింది. దిగుమతి వస్తువులపై సుంకాలు పెరగడం వల్ల.. విమాన పరికాల ధరి మరింత పెరిగినట్లు చైనా భావిస్తున్నది.