కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో అమెరికా ఓ భయానకమైన గందరగోళాన్ని సృష్టించిందని విమర్శించింది చైనా. 20 ఏళ్ల పాటు ఆ దేశంలో తమ బలగాలను మోహరించి.. ఇప్పుడో పద్ధతి లేకుండా ఉపసంహరించడం వల్లే ఈ దుస్థితి నెలకొన్నదని చైనా స్పష్టం చేసింది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా వెళ్లిపోగానే తాలిబన్లకు సహకరించడానికి చైనా ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ నిర్ణయంపై ఎన్ని విమర్శలు వచ్చినా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం దీనిని సమర్థించుకున్నారు. ఇంకా ఎన్ని తరాలను ఆఫ్ఘనిస్థాన్‌కు పంపించమంటారంటూ ఆయన ప్రశ్నించారు.
అయితే బైడెన్ నిర్ణయాన్ని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా తప్పుబట్టింది. మంగళవారం ఆ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ మాట్లాడుతూ.. ఆఫ్ఘన్ కుటుంబాల్లో అశాంతి నెలకొని, చెల్లాచెదురయ్యారని, ఓ భయానక గందరగోళానికి ఈ నిర్ణయం దారి తీసిందని విమర్శించారు. అమెరికా బలం, పాత్ర విధ్వంసమే కానీ నిర్మాణం కాదు అని హువా చాలా ఘాటుగా స్పందించారు. ఇప్పటికే తాలిబన్లతో ఓ స్నేహపూర్వక సంబంధానికి తాము సిద్ధంగా ఉన్నట్లు హువా స్పష్టంచేశారు.