వాషింగ్టన్: నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ 1969లో చంద్రుడిపై కాలుమోపడం మానవ చరిత్రలో కీలక ఘట్టం. దీని ద్వారా అంతరిక్ష పోటీలో అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా స్పేస్ రేస్ మొదలైనట్టు కనిపిస్తున్నది. ఈ క్రమంలో అమెరికా మాజీ వ్యోమగామి బిల్ నెల్సన్ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఇతర దేశాల భూభాగాలు తమవిగా పేర్కొంటున్న డ్రాగన్ దేశం.. చందమామ విషయంలోనూ ఇదే తరహాలో వ్యవహరించొచ్చని, అక్కడి భూభాగం తమదేనంటూ వాదించొచ్చని ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ‘శాస్త్ర పరిశోధనల ముసుగులో వాళ్లు చంద్రుడిపై స్థలాన్ని పొందకుండా మనం చూడాలి’ అని నెల్సన్ అన్నారు. 2030లోగా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపుతామని చైనా ప్రకటించిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. దీనికి చైనా అధికారులు స్పందిస్తూ చైనా చేస్తున్న సాధారణ, చట్టబద్ధమైన అంతరిక్ష ప్రయోగాలను నెల్సన్ బాధ్యతా రాహిత్యంగా తప్పుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు.