వాషింగ్టన్ : పశ్చిమాసియాలో అమెరికా కీలక సైనిక మోహరింపులు చేస్తున్నది. విమాన వాహక నౌక, యుద్ధ విమానాలు సహా మిలిటరీ హార్డ్‌వేర్‌ను తిరిగి ఈ ప్రాంతానికి పంపిస్తున్నది. ఇరాన్‌పై దాడి గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి మిశ్రమ సంకేతాలు వస్తున్నాయి. తమపై దాడి చేస్తే, ఈ ప్రాంతమంతా విస్తృతస్థాయి సైనిక ఘర్షణలో కూరుకుపోతుందని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ ఆకస్మిక యుద్ధానికి సిద్ధమవుతున్నది. అమెరికన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, మిడిల్ ఈస్ట్‌లో కార్యకలాపాలను పర్యవేక్షించే యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్‌ను అమెరికా బలోపేతం చేస్తున్నది. ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ జెట్స్, విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్లను ఇరాన్‌కు సమీపంలో ఉంచుతున్నది. ఈ ప్రాంతంలో తన ఎయిర్, మిసైల్ డిఫెన్సెస్ను పటిష్టం చేసింది. ట్రంప్ గురువారం మాట్లాడుతూ, ఇరాన్ వైపు ‘బిగ్ ఫోర్స్’ వెళ్తున్నట్లు తెలిపారు. ఏదో జరుగుతుందని కాదు కానీ, తాము ఇరాన్‌ను చాలా సన్నిహితంగా గమనిస్తున్నామని చెప్పారు.
ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్సెస్ మ్యాగజైన్ కథనం ప్రకారం, అమెరికన్ వాయు సేనకు సంబంధించిన 12 ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ జెట్స్‌ను యూకే నుంచి జోర్డాన్ వాయు సేన స్థావరాలకు తీసుకొచ్చారు. వీటితోపాటు కేసీ-135 ఏరియల్ రీఫ్యూయలర్స్, సీ-130 కార్గో విమానం కూడా వచ్చాయి. ఎఫ్-15ఈ రకరకాల పోరాటాల్లో పాల్గొనే విమానం. నిరుడు ఇరాన్‌తో 12 రోజులపాటు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్, అమెరికా ఈ విమానాన్ని ఉపయోగించాయి. ఇరాన్ పంపిన డ్రోన్లను ఎదుర్కొన్నాయి. ఇదిలావుండగా, అమెరికా ఇరాన్‌పై దాడి చేస్తే, తమపై ఇరాన్ దాడి చేస్తుందని ఇజ్రాయెల్ కలవరపడుతున్నది. అమెరికా నుంచి బహిరంగ ప్రకటన రాకపోయినప్పటికీ, అత్యంత అప్రమత్తతతో ఉంటున్నట్లు ఇజ్రాయెల్ భద్రతాధికారులు చెప్పారు. వేర్వేరు సందర్భాలు ఎదురైనపుడు తిప్పికొట్టడానికి సైనిక, పోలీసు, అత్యవసర సేవలు, పౌర పాలనా యంత్రాంగాలు సిద్ధంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థను హై అలర్ట్‌లో ఉంచారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి ‘వాల్ స్ట్రీట్ జర్నల్’లో రాసిన వ్యాసంలో, తమపై మళ్లీ దాడి చేస్తే, 2025 జూన్‌లో చూపిన ప్రతిఘటన కన్నా తీవ్రంగా తమ సాయుధ దళాలు స్పందిస్తాయన్నారు. ఇజ్రాయెల్ అమెరికాను యుద్ధం దిశగా నెడుతున్నదని ఆరోపించారు. ఇజ్రాయెల్ నేతలు అమెరికన్ నేతలకు చెప్తున్న దాని కన్నా తీవ్ర స్థాయిలో, సుదీర్ఘ కాలం తమ ప్రతిఘటన ఉంటుందని హెచ్చరించారు. ఇదిలావుండగా, అమెరికన్ మీడియా కథనాల ప్రకారం, ట్రంప్ సలహాదారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌పై పరిమితంగా, భీకర దాడి చేయాలని కొందరు ఆయనకు సలహా ఇస్తుండగా, ఇరాన్ ప్రతిఘటన వేగంగా ప్రాంతీయ యుద్ధానికి దారి తీస్తుందని మరికొందరు చెప్తున్నారు.