వాషింగ్టన్, నవంబర్ 5: అగ్రరాజ్యం అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్‌ను ఎన్నుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య నెలకొన్న హోరాహోరీ పోటీలో విజేతను నిర్ణయించే తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. మంగళవారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరిగింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4.30కు పోలింగ్ ప్రారంభమైంది.
దాదాపు 50 లక్షల మంది ఆదివారం నాటికే ముందస్తుగా ఓట్లు వేయగా మిగతా వారు ఉత్సాహంగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ‘ఓటు వేసి మీ వాణిని వినిపించండి’ అంటూ కమలా హారిస్ ఓటర్లకు పిలుపునివ్వగా, ‘కలిసికట్టుగా మళ్లీ అమెరికాను గొప్పగా మార్చగలం. బయటకొచ్చి ఓటేయండి’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్, ఆయన భార్య మెలానియా ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఓటు వేయగా, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ సిన్సినాటిలో ఓటు వేశారు.
మిస్సౌరీలోని పలు ప్రాంతాల్లో వరదల కారణంగా ఓటింగ్‌కు అంతరాయం ఏర్పడింది.జార్జియాలోని ఫుల్టన్ కౌంటీలో నకిలీ బాంబు బెదిరింపులు రావడంతో రెండు పోలింగ్ కేంద్రాలను ఖాళీ చేయించి, అరగంట తర్వాత మళ్లీ ప్రారంభించారు. ఉగ్ర హెచ్చరికలపై నకిలీ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎఫ్‌బీఐ సూచించింది. పెన్సిల్వేనియాలో సాంకేతిక సమస్యలతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11.30 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
భారత్‌లా అమెరికాలో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ లాంటిది లేదు. ఆయా రాష్ర్టాలే ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తాయి. ఎన్నికల కౌంటింగ్ పూర్తి చేసి ప్రకటించేందుకు డిసెంబరు 11 వరకు సమయం ఉంటుంది. అధికారికంగా ఫలితాలు వెలువడేందుకు సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ ముందుగా మీడియా సంస్థలు నాలుగైదు రోజుల్లో ఫలితాలను అంచనా వేయవచ్చు.
విజయంపై విశ్వాసం ఉంది. నిజాయితీగా ఎన్నిక జరిగితే ఓటమినైనా మొదటగా నేనే అంగీకరిస్తా. ఎన్నిక నిజాయితీగానే జరుగుతున్నదని అనుకుంటున్నా. ఓడితే హింసకు పాల్పడొద్దని నా మద్దతుదారులకు చెప్పక్కర్లేదు. వారు హింసకు దూరంగా ఉంటారు.
నేను గెలిస్తే ప్రజల జీవన వ్యయాన్ని తగ్గిస్తా. దేశంలో దెబ్బతిన్న వలస విధానాన్ని సరిచేస్తా. చైనాతో నెలకొన్న పారిశ్రామిక పోటీలో దేశాన్ని గెలిపిస్తా.