Israel | జెరూసలేం, అక్టోబర్ 3: సరిగ్గా ఏడాది క్రితం అక్టోబరు 7న అర్ధరాత్రి ఇజ్రాయెల్‌పై గాజాస్ట్రిప్ నుంచి హమాస్ విరుచుకుపడింది. రాకెట్ దాడులతో పాటు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి దాడి చేసి వందలాది మందిని హతమార్చింది. దీంతో హమాస్‌పై ఇజ్రాయెల్ కన్నెర్ర చేసి ప్రతిదాడికి దిగింది. ఏడాది క్రితం కేవలం హమాస్‌తో ప్రారంభమైన ఇజ్రాయెల్ పోరాటం అనేక శక్తులతో ఆరు వైపులా పోరాడాల్సిన స్థితిలోకి వెళ్లింది. దీంతో 2006 తర్వాత ఇప్పుడు మరోసారి ఇజ్రాయెల్ భారీ బహుముఖ యుద్ధాన్ని చేయాల్సి వస్తున్నది.
గాజాలో హమాస్‌ను పూర్తిస్థాయిలో తుడిచిపెట్టే దిశగా ఇజ్రాయెల్ ఏడాది నుంచి దాడులు చేస్తున్నది. హమాస్ స్థావరాలపై నిత్యం గగనతల దాడులు చేస్తున్నది. వేలాదిగా ఇజ్రాయెల్ బలగాలు గాజాలో భూతల దాడులు చేస్తున్నాయి. ఏడాదిగా జరుగుతున్న ఈ దాడుల్లో దాదాపు 50 వేల మంది మరణించినా ఇప్పటికీ ఒక పరిష్కారం దొరకడం లేదు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న తమ పౌరులను విడిపించుకునేందుకు ఇజ్రాయెల్ పోరాటం ఇంకా కొనసాగుతున్నది.
హమాస్‌కు మద్దతుగా ఏడాది కాలంగా ఇజ్రాయెల్‌పై లెబనాన్ నుంచి హెజ్బొల్లా దాడులకు పాల్పడుతున్నది. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా హెజ్బొల్లాను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాను హతమార్చింది. ఒకవైపు గగనతల దాడులు చేస్తూనే లెబనాన్‌లోకి చొచ్చుకెళ్లి భూతల దాడులు ప్రారంభించింది. హెజ్బొల్లాకు సైతం వేల సంఖ్యలో సైనిక బలం ఉండటం, పెద్ద ఎత్తున ఆయుధాలు ఉండటంతో ఈ పోరాటం మరింత తీవ్రరూపం దాల్చనుంది.
యెమెన్‌లోని చాలా ప్రాంతాలను ఆధీనంలో ఉంచుకున్న హౌతీ తిరుగుబాటుదారులు సైతం ఇజ్రాయెల్‌ను శత్రువుగా ప్రకటించారు. హమాస్, హెజ్బొల్లాకు ఉన్నట్టుగానే హౌతీలకూ ఇరాన్ మద్దతు ఉంది. దీంతో తరచూ ఇజ్రాయెల్‌పై హౌతీలు డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌కు దక్షిణ వైపు సరిహద్దుల్లో, జలమార్గాల్లో హౌతీలతో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో హౌతీలపైనా ఇజ్రాయెల్ పోరాడుతున్నది.
సిరియా, ఇరాక్ కేంద్రంగా పని చేస్తున్న మిలీషియాలు సైతం ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నాయి. వీటికి సైతం ఇరాన్ మద్దతు ఉందని, ఇరాన్ నుంచి ఆయుధాలు అందుతున్నాయని ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నది. సిరియా నుంచి మిలీషియాలు ఇటీవల తరచూ ఇజ్రాయెల్‌పై డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్ సైతం సిరియా రాజధాని డమాస్కస్‌లోని మిలీషియా కేంద్రాలపై దాడులు చేస్తున్నది.
ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న వెస్ట్‌బ్యాంక్ ప్రాంతంలో మిలిటెంట్లు చురుగ్గా ఉన్నారు. వీరికి ఇరాన్ మద్దతు ఉందని ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నది. వెస్ట్‌బ్యాంక్‌లో మిలిటెంట్లు, ఇజ్రాయెల్ బలగాలు మధ్య తరచూ దాడులు జరుగుతుంటాయి. పాలస్తీనాతో పాటు ఇజ్రాయెలీలు నివసించే ఈ ప్రాంతంలో మిలిటెంట్లతో పోరాటం ఇజ్రాయెల్‌కు సమస్యాత్మకంగా మారింది.
గత ఏడాదికాలంగా ఇజ్రాయెల్ వ్యతిరేక శక్తులకు పరోక్షంగా అండగా ఉంటున్న ఇరాన్ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్‌పై ఒకేసారి 180 క్షిపణులతో విరుచుకుపడి యుద్ధానికి సిద్ధమని చెప్పకనే చెప్పింది. ఈ దాడితో ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసిందని, ఇందుకు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఇజ్రాయెల్ సైతం ప్రకటించింది. దీంతో ఇరు దేశాల మధ్య పోరు తీవ్రం కానుంది. మిగతా అన్ని మిలిటెంట్ సంస్థలతో పోరాటం ఒక సవాల్ అయితే, నేరుగా ఇరాన్‌తో పోరాటం ఇజ్రాయెల్‌కు పెద్ద సవాల్‌గా మారనుంది.