Russian Chef | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పుతిన్ తన శత్రువులను అంత సులువుగా విడిచిపెట్టరని అతని రాజకీయ ప్రత్యర్థులు అంటుంటారు. ఆయన్ను ఎదురించడం అంటే.. చావు నోట్లో తల పెట్టడమే. ఆయనకు ఎదురెళ్లిన వాళ్లు, విమర్శించిన వాళ్లు అంతుచిక్కని రీతిలో మృత్యు ఒడికి చేరుతారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే అనేకం వెలుగు చూశాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై మాస్కో యుద్ధం తర్వాత ఆ దేశ సంపన్నులు, రాజకీయ నాయకులు, వ్యాపారులు, జర్నలిస్టులు వరుసగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఒకరి తర్వాత ఒకరు రోజుల వ్యవధిలోనే మృత్యువాతపడిన తీరు ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. తాజాగా ఓ రష్యన్ చెఫ్ (Russian Chef) అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది.
రష్యాలో ప్రముఖ చెఫ్‌గా పేరొందిన అలెక్సై జిమిన్ (Alexei Zimin) తాజాగా సెర్బియాలోని ఓ హోటల్లో (Serbia Hotel) అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఇటీవలే తన పుస్తకం ప్రచారం నిమిత్తం అక్కడికి వెళ్లిన అతను ఓ హోటల్ గదిలో విగతజీవిగా కనిపించాడు. అతడి మరణానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. టీవీ వ్యాఖ్యతగా, వంటల ప్రోగ్రాం నిర్వహించే జిమిన్.. గతంలో పుతిన్‌ను బహిరంగంగా విమర్శించారు. ఆ తర్వాత 2014లో అతను దేశం విడిచి లండన్ వెళ్లిపోయాడు. అక్కడ జీమా పేరుతో రెస్టారెంట్ ప్రారంభించి అక్కడే స్థిరపడ్డాడు.
ఈ క్రమంలో ఉక్రెయిన్‌తో మాస్కో యుద్ధం నేపథ్యంలో మరోసారి పుతిన్‌పై జిమిన్ విమర్శలు చేశాడు. అదే సమయంలో ఉక్రెయిన్ శరణార్థుల కోసం విరాళం ఇచ్చినందుకు తనకు, తన రెస్టారెంట్‌కు బెదిరింపులు వస్తున్నట్లు జిమిన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ పరిణామాల వేళ అతను అనుమానాస్పద స్థితిలో మరణించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కాగా, పుతిన్ హయాంలో ఆయనను విమర్శించిన ఎంతో మంది రాజకీయ, సామాజిక, వ్యాపార ప్రముఖులు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. రష్యా కిరాయి సైన్యంగా పేరొందిన వాగ్నర్ గ్రూప్‌నకు నాయకత్వం వహించిన ప్రిగోజిన్ మొదలు.. గతంలో రష్యా ప్రధానిగా పనిచేసిన బోరిస్, రష్యన్ జర్నలిస్ట్ అన్నా పొలిట్కోవ్స్కాయ, రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ ఏజెంట్ అలెగ్జాండర్ లిట్వినెంకో సహా అనేక మంది వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు అనుమానాస్పద రీతిలో లేదా హఠాత్తుగా వివిధ కారణాలతో మరణించిన రష్యా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఏదో ఒక సందర్భంలో పుతిన్‌పై విమర్శలు చేసిన వారే.
Also Read..
Israel | ఇజ్రాయెల్‌కు షాక్.. లెబనాన్‌లో నలుగురు సైనికులు మృతి..!
Sri Lanka | శ్రీలంకలో పార్లమెంట్ ఎన్నికలు.. బరిలో 8,821 మంది అభ్యర్థులు.. రేపే ఫలితాలు
Melania Trump | ఫస్ట్ లేడీగా మెలానియా ట్రంప్.. శ్వేత సౌధంలో మాత్రం ఉండకపోవచ్చు..!