Israel | హిజ్బొల్లాకు వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటంలో ఇజ్రాయెల్‌కు భారీ షాక్ తగిలింది. ఆ దేశానికి చెందిన ఆరుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ లెబనాన్‌లో జరిగిన పోరాటంలో ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. లెబనాన్‌లో హిజ్బొల్లాకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మరణించిన ఇజ్రాయెల్ సైనికుల సంఖ్య 47కి పెరిగింది. ఓ గ్రామంలో జరిగిన దాడిలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఐడీఎఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ గ్రామంలోని నలుగురు సైనికులు దాడి ప్రారంభించారు.
ఈ క్రమంలో ఓ భవనంలో ఉన్న నలుగురు హిబ్బొల్లా యోధులు సైనికులపైకి కాల్పులు జరుపడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ సైన్యం జరిపిన ప్రతీకార దాడిలో నలుగురు హిజ్బొల్లా వారియర్స్ సైతం మరణించారు. నలుగురు సైనికులు గోలానీ బ్రిగేడ్‌లోని 51వ బెటాలియన్‌కు చెందిన సైనికులని ఐడీఎఫ్ పేర్కొంది. ఇంతకు ముందు అక్టోబర్ 2న లెబనాన్‌లో జరిగిన దాడిలో ఎనిమిది మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ మాట్లాడుతూ హిజ్బొల్లాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఉదాసీనత పనికిరాదన్నారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైనికుల మరణంపై సంతాపం ప్రకటించారు. సెప్టెంబర్ 23న లెబనాన్‌లోని హిజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబు దాడులు నిర్వహించింది. అదే నెల 30న ఇజ్రాయెల్ సైనికులను లెబనాన్‌లో మోహరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో ఇప్పటివరకు 3,360 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం బీరుట్లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఎనిమిది మంది చనిపోయారు. ఇజ్రాయెల్ సైన్యం బీరూట్‌కు దక్షిణాన ఉన్న జనసాంద్రత కలిగిన అరమౌన్పై దాడి చేసింది. మరోవైపు, టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయంపై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు హిజ్బొల్లా బుధవారం పేర్కొంది. అయితే, ఆ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది.