ఫుకెట్, నవంబర్ 19: సాంకేతిక కారణాల వల్ల 80 గంటలకుపైగా నిలిచిపోయిన విమాన సర్వీస్ దాదాపు 100 మంది ఇండియా ప్రయాణికులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. పలువురు ప్రయాణికులు తమ అవస్థను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ నెల 16న రాత్రి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి విమానం ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది. అయితే సాంకేతిక తప్పిదం వల్ల విమానం ఆరు గంటలు ఆలస్యమవుతుందని ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు ప్రయాణికులకు తెలిపారు.
అయితే అంతసేపు నిరీక్షించిన తర్వాత విమానం రద్దయిందని వెల్లడించారు. అయితే ఆ తర్వాత ఆ తప్పిదాన్ని సరిచేసి అదే విమానంలో ప్రయాణికులను ఎక్కించారు. కానీ రెండున్నర గంటల తర్వాత మళ్లీ సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం తిరిగి ఫుకెట్ విమానాశ్రయంలో దిగింది. విమానం ఆలస్యంపై ఎయిర్ ఇండియా ప్రతినిధులు మాట్లాడుతూ.. పైలెట్ల విధుల సమయ పరిమితి వల్ల ఈ నెల 16న విమానం ఎగురలేదన్నారు. 17న సాంకేతిక కారణాల వల్ల విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యిందన్నారు.