వాషింగ్టన్: కృత్రిమ మేధ (ఏఐ) మన జీవితాల్లో భాగంగా అల్లుకుపోతున్నది. చాట్‌బాట్స్ నుంచి ైక్లెమేట్ మోడల్స్ వరకు మనకు సేవలందిస్తున్నాయి. వీటి కోసం భౌతిక సదుపాయాలు విస్తరిస్తున్నాయి. ఈ ఏఐ బూమ్తోపాటు నీటికి కూడా డిమాండ్ పెరుగుతున్నది. ఇప్పటి వరకు ఈ రంగం వినియోగించే విద్యుత్తు గురించి మాత్రమే చర్చ జరుగుతున్నది. కానీ పరిశోధకుల అధ్యయనంలో ఈ రంగం తాజా నీటిని అత్యధికంగా వినియోగించుకుంటున్నదని వెల్లడైంది. కరువుకాటకాలు, వర్షపాతం కొరత వల్ల నీటి కోసం సమస్యను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో భారత్ కూడా ఉంది. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ వంటి ఏఐ సిస్టమ్స్‌కు సంబంధించిన డాటా సెంటర్లు అత్యధిక నీటి ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఉన్నాయి.
సర్వర్లతో కూడిన భారీ డాటా సెంటర్లపై ఏఐ మోడల్స్ ఆధారపడతాయి. ఈ సర్వర్లు నిరంతరం, అన్ని వేళలా పని చేస్తాయి. ఉష్ణాన్ని విడుదల చేస్తాయి. కాబట్టి వాటిని చల్లబరచవలసి ఉంటుంది. అత్యధిక కూలింగ్ సిస్టమ్స్ ఇప్పటికీ భారీగా తాజా నీటిపైనే ఆధారపడుతున్నాయి. ఈ విధంగా ఉపయోగించిన నీటిలో చాలా వరకు ఆవిరిగా మారిపోతుంది లేదా వ్యర్థ జలంగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 45 శాతం డాటా సెంటర్లు నదీ తీర ప్రాంతాల్లోనే ఉన్నాయి.
ఈ ప్రాం తాలు ఇప్పటికే నీటి లభ్యత విషయంలో తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నాయి. కేవలం అమెరికాలోని డాటా సెంటర్లు 2023లో 6,600 కోట్ల లీటర్ల నీటిని వినియోగించుకున్నాయి. నీటికి సంబంధించిన ఆందోళన డాటా సెంటర్లు ప్రత్యక్షంగా వినియోగించుకునే నీటికి మాత్రమే పరిమితం కాదు, విద్యుత్తు ఉత్పత్తి కోసం పరోక్షంగా వినియోగించుకునే నీటి విషయంలో కూడా ఆందోళన ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా ఏఐ పెట్టుబడులు పెరుగుతున్న తరుణంలో ఈ అధ్యయన నివేదిక వచ్చింది. 100 పదాల ఏఐ ప్రామ్ట్ కోసం దాదాపు ఒక సీసా నీరు ఖర్చవుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. భారత్, చైనా, స్పెయిన్, జర్మనీ వంటి దేశాల్లో డాటా సెంటర్ల సామర్థ్యం పెరుగుదలకు నీటి లభ్యత సమస్య ఎదురవుతుందని ఈ నివేదిక తెలిపింది. భారత దేశంలో నీటి సమస్య పెరుగుతుండటం వాస్తవం, అదే సమయంలో ఏఐ కోసం డిమాండ్, ప్రజాదరణ కూడా పెరుగుతున్నాయి. తాజా నీటిపై ఆధారపడే ఇతర రంగాలు, జీవనోపాధులకు ఈ పరిస్థితి హానికరం.