China : అఫ్గానిస్థాన్ (Afghanistan) లోని బాగ్రాం వైమానిక స్థావరాన్ని (Bagram air base) మళ్లీ స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. దీనిపై తాజాగా చైనా (China) స్పందించింది. బాగ్రాంలో అమెరికా మళ్లీ పాగా వేసే నిర్ణయాన్ని అఫ్గానిస్థాన్ ప్రజలకు వదిలేయాలని అభిప్రాయపడింది. వారి భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని పేర్కొంది.
‘అఫ్గాన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని చైనా (China) గౌరవిస్తుంది. అఫ్గాన్ భవిష్యత్తు అక్కడి ప్రజల చేతుల్లోనే ఉంది. ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచడంవల్ల మద్దతు లభించదు. ప్రాంతీయ స్థిరత్వం కోసం సంబంధిత పక్షాలు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాయని ఆశిస్తున్నాం’ అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ పేర్కొన్నారు.
బ్రిటన్ పర్యటనలో భాగంగా ప్రధాని కీర్ స్టార్మర్తో భేటీ అనంతరం మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్.. అఫ్గానిస్థాన్‌లోని బాగ్రాం వైమానిక స్థావరంలో మళ్లీ పాగా వేయాలని భావిస్తున్నామని చెప్పారు. ప్రత్యర్థి చైనా అణ్వాయుధ తయారీ కేంద్రాలకు అది అతి దగ్గరగా ఉంటుందని, కేవలం గంట వ్యవధిలో వెళ్లవచ్చన్నారు.