న్యూఢిల్లీ: ఎక్కువసేపు కూర్చోవటం క్యాన్సర్బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. తేలికపాటి శారీరక శ్రమతో క్యాన్సర్ మరణాలను తగ్గించవచ్చునని పరిశోధకులు శాస్త్రీయంగా గుర్తించారు. గ్లాస్గో వర్సిటీ, ఇతర పరిశోధకుల బృందం యూకే బయోబ్యాంక్లో నమోదైన 91,292 మంది డాటాను విశ్లేషించారు. క్యాన్సర్ మరణాలను అంచనావేయడానికి వారిని సగటున 12.4 సంవత్సరాలపాటు పరిశోధకులు పరిశీలించారు.
వీరి అధ్యయనం ప్రకారం, 30 నిమిషాలకుపైగా నిరంతరాయంగా కూర్చోవటం వల్ల క్యాన్సర్తో మరణించే ముప్పు 9శాతం అధికం. ప్రతిరోజూ ఒక గంట కూర్చోవటం కాకుండా తేలికపాటి శారీరక శ్రమతో గడిపితే..మరణాలు 12శాతం తగ్గుతాయి. ఎక్కువసేపు కూర్చోవటం డయాబెటిస్, రక్తపోటు, గుండె జబ్బులబారిన పడే ముప్పును పెంచుతుందని ఇప్పటికే నిరూపితమైంది. క్రమం తప్పకుండా చిన్నపాటి కదలికలతో ఉన్న వ్యక్తుల్లో క్యాన్సర్ సంభవించటం, మరణాలు తక్కువగా ఉన్నాయని అధ్యయనం తేల్చింది.