మియామీ, ఫిబ్రవరి 15 : అన్ని రంగాల్లో మానవుల స్థానాన్ని రోబోలు భర్తీ చేయగలవని ప్రపంచం విశ్వసిస్తున్నది. అయితే ఇది పూర్తి నిజం కాదన్న సంగతి మరోసారి బయటపడింది. అమెరికాలో వైద్యులు ఓ సర్జికల్ రోబో సాయంతో నిర్వహించిన పెద్ద ప్రేగు క్యాన్సర్ ఆపరేషన్ వికటించింది. శస్త్ర చికిత్సలో వాడిన సర్జికల్ రోబో తన భార్య చిన్న ప్రేగుకు రంధ్రాలు చేసిందని, ఇది ఆమె మరణానికి దారితీసిందని ఓ వ్యక్తి అక్కడి కోర్టులో దావా వేశారు.
సర్జికల్ రోబోను విక్రయిస్తున్న ‘ఇంట్యూటివ్ సర్జికల్’ సంస్థ 75 వేల డాలర్లు (సుమారుగా రూ.62.26 లక్షలు) నష్టపరిహారంగా చెల్లించాలని కోర్టును కోరారు. ‘న్యూయార్క్ పోస్ట్’ కథనం ప్రకారం, సాండ్రా సుల్జర్ భర్త హార్వే సుల్జర్ ఫిబ్రవరి 6న ‘ఇంట్యూటివ్ సర్జికల్’ అనే కంపెనీపై కోర్టులో కేసు చేశాడు. 2021 సెప్టెంబర్‌లో ఫ్లోరిడాలోని బాప్టిస్ట్ హెల్త్ బోకా రాటన్ రీజినల్ దవాఖానలో సాండ్రా సుల్జర్ పెద్ద ప్రేగుకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు.
రిమోట్‌తో పనిచేసే ‘డా విన్సీ’ అనే సర్జికల్ రోబోను వైద్యులు ఆపరేషన్‌లో వినియోగించారు. రోబో వల్ల ఆమె చిన్న ప్రేగుకు రంధ్రాలు అయ్యాయి. ఆపరేషన్ తదనంతరం ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై.. 2022 ఫిబ్రవరిలో కన్నుమూశారు. ఆపరేషన్ సమయంలో అంతర్గత అవయవాలను రోబో దెబ్బతీస్తున్న సంగతి కంపెనీకి ముందే తెలుసునని, ఈ సంగతి కుటుంబ సభ్యులకు తెలియజేయలేదని మృతురాలి భర్త ఆరోపించారు.
రోబోతో ఏర్పడిన గాయాలు, లోపాల గురించి కంపెనీకి వేలాది నివేదికలు అందాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయినప్పటికీ కంపెనీ యాజమాన్యం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌ను తప్పుదారి పట్టించిందని దావాలో పేర్కొన్నారు. డా విన్సీ రోబో వాడకంపై వైద్యులకు తగిన శిక్షణ ఇవ్వడంలో సంస్థ విఫలమైందని, అనుభవం లేని దవాఖానలకు రోబోలను విక్రయించిందని ఆయన ఆరోపించారు.