న్యూఢిల్లీ, నవంబర్ 14: అమెరికాలో ప్రతిభావంతులు లేరని, విదేశీ నిపుణుల అవసరం ఉన్నందున హెచ్-1బీ వీసా కార్యక్రమం అనివార్యమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని రోజులకే హెచ్-1బీ వీసాకు ముగింపు పలికేందుకు త్వరలోనే ఓ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు అమెరికా కాంగ్రెస్ రిపబ్లికన్ సభ్యురాలు మార్జోరీ టేలర్ గ్రీనే వెల్లడించారు. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ని తొలగించి విదేశీ ఉద్యోగుల స్థానంలో అమెరికన్లను భర్తీ చేయడానికి తాను ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు ఎక్స్ వేదికగా ఆమె గురువారం తెలిపారు.
ఈ తాత్కాలిక వర్క్ వీసా ద్వారా అత్యధికంగా లబ్ధి పొందుతున్న భారతీయులు హెచ్-1బీ కార్యక్రమంపై వేటు పడితే అధికంగా నష్టపోయే అవకాశముంది. గ్రీన్ కార్డు మార్గం ద్వారా అమెరికా పౌరసత్వాన్ని పొందేందుకు హెచ్-1బీ సులువైన మార్గంగా ఉపయోగపడుతోంది. అమెరికన్ ఉద్యోగులకు ప్రయోజనాలు దక్కకుండా చేసేందుకు అమెరికా సంస్థలు హెచ్-1బీ ప్రోగ్రామ్ని దుర్వినియోగం చేస్తున్నాయని కూడా గ్రీనే ఆరోపించారు.
మన సొంత మనుషులనే పక్కనపెట్టేందుకు హెచ్-1బీ ప్రోగ్రామ్ని టెక్, ఏఐ దిగ్గజాలు, దవాఖానలు, పరిశ్రమలు దుర్వినియోగం చేస్తున్నట్లు ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులు అమెరికన్లని, అమెరికన్ల పట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందని ఆమె తెలిపారు. తన బిల్లులో డాక్టర్లు, నర్సులు వంటి వైద్య నిపుణులకు మాత్రం ఏడాదికి 10,000 వీసాలు ఇవ్వడానికి గ్రీనే మినహాయింపు ఇచ్చారు. ఆ మినహాయింపు కూడా 10 సంవత్సరాల తర్వాత ముగిసిపోతుందని ఆమె చెప్పారు.