ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా దండయాత్ర సందర్భంగా జరుగుతున్న మారణహోమాన్ని ఐక్యరాజ్యసమితి (United Nations) తీవ్రంగా ఖండించింది. గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా (Russia) దురాక్రమణ (Invasion) నేటికి 500 రోజుల మార్కును దాటిందని, ఇప్పటివరకు 9 వేల మంది మరణించారని ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌పై సైనికచర్యను 2022, ఫిబ్రవరి 24న రష్యా ప్రారంభించింది. ఈ యుద్ధంలో నేటివరకు 9 వేల మందికిపైగా సాధారణ పౌరులు చనిపోయారని ఉక్రెయిన్‌లో ఐరాసకు చెందిన హ్యూమన్ రైట్స్ మానిటరింగ్ (HRMMU) డిప్యూటీ హెడ్ నోయెల్ కల్హౌన్ (Noel Calhoun) చెప్పారు. వారిలో 500 మంది చిన్నారులు (Children) కూడా ఉన్నారని తెలిపారు.
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం మరో మైళురాయిని దాటింది. ఉక్రెయిన్ పౌరులపై జరుగుతున్న ఈ హింసాత్మక పోరుకు నేటితో 5 వందల రోజులు పూర్తయ్యాయని చెప్పారు. కాగా, గతేడాదితో పోల్చితే 2023లో మృతుల సంఖ్య కొద్దిగా తగ్గిందని తెలిపారు. అయితే మే, జూన్ నెలల్లో మాత్రం మృతులు కొద్దిగా పెరిగారని వెల్లడించారు. జూన్ 27న క్రామ్స్టోర్స్క్పై (Kramatorsk) జరిగిన క్షిపణి దాడిలో నలుగురు చిన్నారులు సహా 13 మంది చనిపోయారన్నారు.