Floods @ Philippines | ఫిలిప్పీన్స్‌లోని దక్షిణ ప్రావిన్స్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. వరదలతో కొండచరియలు విరిగిపడటంతో 72 మంది మరణించారు. దాదాపు 14 మంది గల్లంతయ్యారు. మరో 33 మంది గాయపడ్డారు. వరదల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాంతో ప్రజలు ఇళ్లలోనే చిక్కుకుపోయారు. గత మూడు రోజులుగా వరదలు దక్షిణ ప్రావిన్స్‌ను చుట్టుముట్టాయి. తొలుత చనిపోయిన వారి సంఖ్య 45 గా అధికారులు పేర్కొనగా.. నివేదికలో పొరపాటు జరిగిందని పౌర రక్షణ అధికారులు తెలిపారు. దాంతో మృతుల సంఖ్యను మళ్లీ లెక్కించారు. నేషనల్ సివిల్ డిఫెన్స్ చీఫ్ రఫెలిటో అలెజాండ్రో ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మాగ్విండనావో ప్రావిన్స్‌లోని 3 నగరాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. వరదలు, శిథిలాల కారణంగా అత్యధిక మరణాలు నమోదయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదుల్లోకి చెత్తాచెదారం వచ్చి చేరుతున్నది. బురదలో పలువురు చిక్కుకుని చనిపోయినట్లు, మరికొందరు గల్లంతైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మనుషులతో పాటు పశువులు కూడా వరదల్లో చిక్కుకుపోయాయి. సహాయకచర్యల్లో రక్షణ సిబ్బంది నిమగ్నమై ఉన్నారు.
నల్గేయ్ తుపాను కారణంగా మాగ్విండనావో ప్రావిన్సులో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తుపాన్ ఉత్తర సమర్ ప్రావిన్స్‌లోని తూర్పు నగరమైన కాటమరాన్ నుంచి 180 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రం ఉన్నది. ఈ తుఫాన్ వాయవ్య దిశగా వేగంగా కదులుతున్నది. గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఫిలిప్పీన్స్‌లో ఏటా 20 తుఫానులు సంభవిస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో వచ్చిన రాయ్ తుపాన్ కారణంగా 208 మంది మరణించగా, దాదాపు 4 లక్షల మంది తీవ్రంగా ప్రభావితమయ్యారు. గత ఏప్రిల్ నెలలో కూడా తుఫాన్ విధ్వంసం సృష్టించడంతో 42 మంది చనిపోగా, 17 వేల మంది నిరాశ్రయులయ్యారు.