Donald Trump | వాషింగ్టన్, మార్చి 15: ‘వైట్ హౌస్ (అమెరికా అధ్యక్ష భవనం) ‘ఫైట్ హౌస్‌గా మారింది. మంత్రులు ‘సహ అధ్యక్షుడు’ ఎలాన్ మస్క్‌తో క్యాబినెట్ రూమ్‌లోనే గొడవ పడుతున్నారు. ఈ కొట్లాటలు అధ్యక్షుడు, మరో 20 మంది అధికారుల ముందే పబ్లిక్‌గా జరుగుతున్నాయి. మునుపెన్నడూ లేని రీతిలో పరిపాలనపై బహిరంగంగా అసమ్మతి వ్యక్తమవుతున్నది’ అని డొనాల్డ్ ట్రంప్ 50 రోజుల పాలనపై న్యూయార్క్ టైమ్స్ పత్రిక వ్యాఖ్యానించింది.
వైట్‌హౌస్‌లో విదేశీ ప్రముఖులపై విచారణ జరుపుతూ, వారిని బహిష్కరిస్తున్నారని తెలిపింది. రాబోయే దినాల్లో వైట్‌హౌస్‌ను టెస్లా షోరూమ్‌గా పొరబడే అవకాశం లేకపోలేదని పేర్కొంది. ట్రంప్ తన దౌత్య నీతిని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తున్నారని విమర్శించింది. ఆయన చేసే ట్వీట్లు ప్రపంచ స్టాక్‌మార్కెట్లను అల్లకల్లోలం చేశాయని తెలిపింది. ఆయా దేశాలపై టారిఫ్‌లు విధిస్తాం, తొలగిస్తాం అంటూ ఇష్టం వచ్చిన రీతిలో ట్వీట్లు చేయడంతో కొన్ని లక్షల కోట్లు ఆవిరైపోయాయని పేర్కొంది.ట్రంప్ తన అసంబద్ధ విధానాలతో దీర్ఘకాలిక మిత్రులను దూరం చేసుకొని, ప్రత్యర్థులకు అండగా నిలిచారని పేర్కొంది.