Gaza | గాజా (Gaza)లో ఇజ్రాయెల్ (Israel) మారణహోమాన్ని (Israel strikes) సృష్టిస్తోంది. గాజాలోని పలు ప్రాంతాలపై భీకర దాడులకు పాల్పడుతోంది. గాజాలోని నివాస ప్రాంతాలు, ఆసుపత్రులపై విరుచుకుపడుతోంది. తాజాగా సహాయ ట్రక్కుల కోసం ఎదురుచూస్తున్న వారిపై ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో పాలస్తీనియన్లు మరణించారు.
దక్షిణ గాజా ప్రాంతంలోని ఖాన్ యూనిస్ (Khan Younis)లో మానవతా సాయం తీసుకొచ్చే ట్రక్కుల కోసం ఎదురుచూస్తున్న పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి (Israeli shelling). ఈ దాడిలో 45 మంది పాలస్తీనియన్లు (Palestinians) ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అనేక మంది గాయపడినట్లు పేర్కొంది. క్షతగాత్రులను నాజర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా, గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. 20 నెలల నుంచి జరుగుతున్న ఈ గాజా పోరులో ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 50 వేలు దాటింది. ఈ యుద్ధంలో 55,104 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుల్లో సగానికిపైగా మహిళలు, బాలలు ఉన్నట్లు తెలిపింది. సుమారు 1,24,901 మంది గాయపడినట్లు పేర్కొంది. హమాస్‌ను అంతమొందించి ఆ ఉగ్రసంస్థ చెరలో ఉన్న బందీలను విడుదల చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ సేనలు తెలిపాయి.
Also Read..
Israel-Iran | ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ సన్నిహితుడు మృతి
Indian Students | ఇరాన్ నుంచి అర్మేనియా చేరుకున్న 110 మంది భారతీయ విద్యార్థులు.. రేపు ఢిల్లీకి
Russia Attack | కీవ్‌లోని అపార్ట్‌మెంట్‌పై రష్యా డ్రోన్ దాడి.. 14 మంది మృతి