Turkey school : టర్కీలో స్కూళ్లలో కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఇలాంటి రెండు ఘటనలు జరిగాయి. బుధవారం ఒక స్కూల్లో జరిగిన దాడిలో నలుగురు మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. కాల్పులకు పాల్పడింది ఒక విద్యార్థి. ఈ అంశంపై స్థానిక గవర్నర్ ముకెర్రం ఉన్లూయెర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఘటన ఆగ్నేయ టర్కీలోని కహ్రామన్మారా ప్రావిన్స్ పరిధిలోని ఒనికియబుత్ జిల్లాలో బుధవారం జరిగింది.
పాఠశాలకు వచ్చిన ఒక విద్యార్థి అక్కడి వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆ విద్యార్థి తండ్రి ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. అతడి ఇంట్లో ఆయుధాలున్నాయి. దీంతో ఆ ఆయుధాల్ని తీసుకుని స్కూల్‌కు వచ్చిన విద్యార్థి అక్కడి వారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు కాగా, ఒకరు టీచర్. మరో 20 మంది గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాల్పులకు పాల్పడ్డ విద్యార్థిపై ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ఎన్కౌంటర్లో ఆ విద్యార్థి మరణించాడు. ఈ కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు.
ఇది వరుసగా రెండో రోజు.. రెండో ఘటన. మంగళవారం టర్కీలోని సన్లిఉర్ఫా ప్రావిన్స్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడి పాఠశాలలో ఒక పూర్వ విద్యార్థి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 16 మంది గాయపడ్డారు. అంతకుముందు ఏప్రిల్ 7న ఇస్తాంబుల్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద కూడా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. అనంతరం నిందితుడిపై పోలీసులు కాల్పులు జరపడంతో అతడు మరణించాడు.