Balochistan | పాకిస్థాన్(Pakistan)లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్లు, రైల్వే ట్రాక్‌లు, వాహనాలపై వరుస దాడులకు పాల్పడ్డారు. రహదారిని అడ్డగించి బస్సులు, ట్రక్కుల్లో ప్రయాణిస్తున్న వారిని దింపి విచక్షణారహితంగా కాల్చి చంపారు. బలూచిస్థాన్ (Balochistan) ప్రావిన్స్‌లోని ముసాఖేల్ (Musakhel) జిల్లాలో సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటనలో సుమారు 33 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
ముందుగా ఆదివారం రాత్రి ముసాఖెల్ – రరాషమ్ జాతీయ రహదారిని అడ్డగించిన ఉగ్రవాదులు బస్సులో నుంచి ప్రయాణికుల్ని బలవంతంగా దింపేసి తమ వద్ద ఉన్న తుపాకులతో షూట్ చేశారు. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసిన తర్వాత ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా ఆ రహదారి గుండా బొగ్గును తీసుకెళ్తున్న 10 ట్రక్కులపై కూడా సాయుధులు దాడి చేశారు. డ్రైవర్లను అక్కడికక్కడే షూట్ చేసి చంపేశారు. అనంతరం వాటికి నిప్పు పెట్టినట్లు అసిస్టెంట్ కమీషనర్ ముసాఖేల్ నజీబ్ కాకర్ తెలిపారు. దేశంలోని ప్రావిన్సుల్లో జరిగిన అతిపెద్ద సాయుధ దాడుల్లో ఇది ఒకటని అధికారులు తెలిపారు.
పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన వారే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు డాన్ న్యూస్ నివేదించింది. పాకిస్థాన్ – ఇరాన్ మధ్య రైల్వే లైన్, బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాను పాకిస్థాన్‌లోని మిగిలిన ప్రాంతాలకు కలిపే వంతెనని కూడా సాయుధులు పేల్చేసినట్లు పేర్కొంది. అదేవిధంగా ప్రావిన్స్ అంతటా పోలీసు స్టేషన్లపై కూడా ఉగ్రవాదులు దాడి చేసినట్లు తెలిపింది. మరోవైపు నిషేధిత తిరుగుబాటు గ్రూపు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడులకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.
Also Read..
Sudan | సుడాన్లో కుప్పకూలిన డ్యామ్.. 60 మంది మృతి
Uber: ఉబర్‌కు 32.4 కోట్ల డాలర్ల జరిమానా
MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ..!