బీరట్: లెబనాన్‌లో పేజర్ అటాక్(Pager Attack) జరిగిన విషయం తెలిసిందే. సెల్ఫోన్లు రాకముందు వాడిన పేజర్లనే లెబనాన్‌కు చెందిన ఉగ్ర గ్రూపు హిజ్బుల్లా ఇంకా వాడుతున్నది. ఇటీవల తైవాన్‌లో తయారైన 5 వేల పేజర్లకు ఆర్డర్ ఇచ్చింది హిజ్బుల్లా గ్రూపు. అయితే ఆ పేజర్లలోని ప్రతి డివైజ్‌లో సుమారు మూడు గ్రాముల పేలుడు పదార్ధాలను వినియోగించినట్లు లెబనీస్ భద్రతా దళాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయిల్‌కు చెందిన మోసాద్ నిఘా ఏజెన్సీ ఆ పేలుడు పదార్ధాన్ని అమర్చినట్లు భావిస్తున్నారు. అత్యంత సీక్రెట్‌గా సాగిన ఆ ఆపరేషన్ వల్ల.. మంగళవారం వేల సంఖ్యలో హిజ్బుల్లా వ్యక్తులు గాయపడ్డారు.
ఇజ్రాయిల్ చేపట్టిన పేజర్ అటాక్‌కు ప్రతీకారం తీర్చుకోనున్నట్లు హిజ్బుల్లా పేర్కొన్నది. కానీ ఇజ్రాయిల్ మిలిటరీ మాత్రం ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. ఎన్నో నెలల క్రితమే పేజర్ అటాక్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. పేజర్లనే బీపర్లు కూడా అంటారు. అయితే తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో కంపెనీ నుంచి హిజ్బుల్లా 5వేల పేజర్లను ఆర్డర్ చేసింది. కానీ ఆ పేజర్లను యురోపియన్ కంపెనీ తయారు చేసినట్లు గోల్డ్ అపోలో వ్యవస్థాపకుడు హుసూ చింగ్ కువాంగ్ తెలిపారు.
ఏపీ924 మోడల్ పేజర్లను హిజ్బుల్లా వాడుతోంది.ఆ పేజర్లు.. వైర్లెస్ సర్వీస్ చేస్తాయి. టెక్ట్స్ మెసేజ్‌లను కూడా డిస్ప్లే చేస్తాయి. కానీ వాటితో టెలిఫోన్ కాల్స్ చేయరాదు. ఇజ్రాయిల్ దళాల నుంచి లొకేషన్ ట్రాకింగ్ జరగకుండా ఉండేందుకు పేజర్లను హిజ్బుల్లా ఫైటర్లు వాడుతున్నారు. కానీ ఆ పేజర్లను ఇజ్రాయిల్ నిఘా సంస్థ మోసాద్ .. మార్చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పేజర్లలో పేలుడు పదార్ధాలను అమర్చారని, ఏదైనా కోడ్ ఇవ్వగానే అవి పేలుతున్నాయని, దీన్ని డిటెక్ట్ చేయడం కష్టమని, స్కానింగ్ చేసినా గుర్తుపట్టలేమని పేర్కొన్నారు.
సుమారు 3వేల పేజర్లు ఒకేసారి పేలి ఉంటాయని భావిస్తున్నారు. కోడ్ మెసేజ్ చేసిన తర్వాత అవి విస్పోటనం చెందినట్లు అంచనా వేస్తున్నారు. పేజర్లలో ఉన్న పేలుడు పదార్థాలను హిజ్బుల్లా గుర్తించలేకపోయిందన్నారు. లెబనాన్‌లో పేలిన పేజర్లపై గోల్డ్ అపోలో సిక్టర్ ఉన్నట్లు గుర్తించారు. ఈ కంపెనీ ఉత్పత్తులు తైవాన్‌లో తయారీ అవుతాయి.