16 మందికి తీవ్ర గాయాలు
న్యూయార్క్ సబ్వే స్టేషన్లో ఘటన
పూర్తిగా పొగతో నిండిన సబ్వే
పేలుడు జరిగిందని అనుమానం
న్యూయార్క్, ఏప్రిల్ 12: అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. న్యూయార్క్ నగరం బ్రూక్లిన్ సబ్వే రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని దుండగుడు ఉన్నట్టుండి కాల్పులకు తెగబడ్డాడు. మంగళవారం ఉదయం రద్దీగా ఉండే సమయంలో ఈ ఘట న చోటుచేసుకుంది. ఘటనలో 16 మంది గాయపడ్డారు. వారిలో 8 మందికి బుల్లెట్ల గాయాలు అయ్యా యి. తీవ్ర గాయాలతో నెత్తురోడుతూ ప్లాట్‌ఫాంపై పలువురు పడి ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. కాగా, ఘటనా స్థలంలో విపరీతమైన పొగ కమ్ముకుంది. కాల్పులు జరుపడానికి ముందు నిందితుడు స్మోక్ పరికరంతో స్టేషన్లో పొగ కమ్ముకునేలా చేసి ఉంటాడని పోలీసు అధికారి వివరించారు.
హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితులను దవాఖానలకు తరలించారు. కాల్పులు జరిపిన దుండగుడు నిర్మాణరంగ కార్మికుడి చొక్కా వేసుకుని, గ్యాస్ మాస్కు ధరించి ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్టేషన్లో పేలుడు సంభవించి ఉంటుందని పోలీసు అధికారులు తొలుత చెప్పారు. అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించ లేదని పోలీసు విభాగం ప్రకటన విడుదల చేసింది.