సిటీబ్యూరో, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ) : సైబర్నేరాలను నియంత్రించడంలో జోనల్ సైబర్ సెల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయని, సైబర్నేరాలను అరికట్టడానికి , కేసుల పరిష్కారానికి బ్యాంకులు, టెలికాం సంస్థలు, న్యాయ సంస్థలతో కలిసి పనిచేయాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. శుక్రవారం కమిషనర్ కార్యాలయంలో నగర పరిధిలోని ఏడు జోనల్ సైబర్ సెల్స్ రెండు నెలలుగా పనిచేస్తున్న విధానం, సాధించిన పురోగతిపై సమీక్షించారు.
ఎన్సీఆర్పీ ఫిర్యాదులను పరిష్కరించడం, మోసపోయిన డబ్బును తిరిగి ఇప్పించడం, కేసుల దర్యాప్తు, ప్రజలకు అవగాహన కల్పించడం, రాష్ర్టాల మధ్య సమన్వయం, సీసీటీఎన్ఎస్లో సమాచారాన్ని నమోదు చేయడంపై కమిషనర్ ఆయా జోనల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత రెండు నెలల్లో 8209 ఫిర్యాదులను పరిష్కరించామని, 768 కేసుల్లో రూ.1.41 కోట్ల డబ్బును తిరిగి ఇచ్చేశామని అధికారులు తెలిపారు. సురక్షితమైన డిజిటల్ వ్యవస్థ కోసం ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని, నిరంతర శిక్షణ, అవగాహన కార్యక్రమాల ఆవశ్యకతను కమిషనర్ అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో క్రైమ్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్, సైబర్ క్రైమ్స్ డీసీపీ దారాకవిత పాల్గొన్నారు.