ప్రభుత్వ కోచింగ్ సెంటర్లలో శిక్షణ
ఉద్యోగవేటలో నిమగ్నమైన యువత
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కోచింగ్ సెంటర్
పీర్జాదిగూడ కేంద్రంలో 1300 మందికి ఉచిత శిక్షణ
త్వరలో మరో 2 కోచింగ్ కేంద్రాలు ప్రారంభం
మేడ్చల్, మార్చి27 : ప్రభుత్వం భర్తీ చేయనున్న ఉద్యోగాలకు నిరుద్యోగ యువత సన్నద్ధం అవుతుంది. కోచింగ్ తీసుకోలేని నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని బుద్ధానగర్ కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్ను ఇటీవలే ప్రారంభించగా, 1300 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారందరికీ శిక్షణ ప్రారంభమైంది. ఉ. 9 నుంచి సా. 5 గంటల వరకు జరిగే శిక్షణ తరగతుల కోసం 15 మంది సీనియర్ అధ్యాపకులను నియమించారు. విద్యార్థులకు ఉచితంగా పోటీ పరీక్షల మెటీరియల్ను అందిస్తూ, ఒక్కో విద్యార్థిపై నెలకు రూ. 5వేల పైనే వెచ్చిస్తున్నారు. మేయర్ జక్క వెంకట్రెడ్డి కోచింగ్ సెంటర్ నిర్వహణను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. కుత్బుల్లాపూర్, ఉప్పల్ నియోజకవర్గాలలో మరో రెండు కోచింగ్ సెంటర్లు త్వరలోనే ప్రారంభించనున్నారు.
సువర్ణ అవకాశం
పోటీ పరీక్షలలో విజయం సాధించేందుకు శిక్షణ తప్పనిసరి. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్ను సద్వినియోగం చేసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా 90 వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ నిర్ణయం హర్షణీయం. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకోలేని నిరుపేద నిరుద్యోగ యువతీ, యువకులకు ఇది మంచి అవకాశం. – శిరీష, ఎంఎస్సీ, బీఈడీ
కోచింగ్ సెంటర్లు పెంచుతాం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అవసరమైతే మరిన్ని ప్రభుత్వం ఆధ్వరంలో కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దీంతో పోటీ పరీక్షలకు నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. నిరుద్యోగుల సంఖ్య ఆధారంగా మరిన్ని కోచింగ్ సెంటర్లను ప్రారంభిస్తాం. – కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
1300మందికి శిక్షణ
పీర్జాదిగూడలో ప్రారంభమైన కోచింగ్ సెంటర్లో 1300 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అన్ని సౌకర్యాలతో కూడిన శిక్షణ అందించేందుకు 15 మంది సీనియర్ అధ్యాపకులను నియమించాం. పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను అందుబాటులో ఉంచాం. భోజన సౌకర్యం కల్పించి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలి.
– జక్క వెంకట్రెడ్డి, పీర్జాదిగూడ మేయర్