మేడ్చల్, అక్టోబరు 3: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోజరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన బడికోల్ భాస్కర్ రెడ్డి కుటుంబం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని జమున వెంచర్లో నివాసం ఉంటుంది. భాస్కర్ రెడ్డి కుమారుడు అజయ్ రెడ్డి(21) డిగ్రీ చదువుతూ తండ్రి నిర్వహించే వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటున్నాడు.
గురువారం దసరా పండుగ సందర్భంగా కాళ్లకల్లో ఉన్న స్నేహితులను కలిసేందుకు బైక్పై వెళ్లాడు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తిరిగి వస్తుండగా రేకుల బావి ప్రాంతానికి సమీపంలో వాహనం అదుపు తప్పి, గుంతలో పడిపోయాడు. ఈ ఘటనలో అజయ్రెడ్డికి తీవ్ర గాయాలై, అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కందుకూరు, అక్టోబర్ 3: రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందగా తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని సలార్పూర్ గ్రామానికి చెందిన నానావత్ దేవేందర్, భార్య శిరీష, కుమారులు సాత్విక్ రాథోడ్ ( 3), ప్రణీత్ (1.5)తో కలిసి బైక్పై మహేశ్వరం మండలం హర్షగూడ గ్రామానికి వెళ్లి తిరిగి ఇంటికి.. హైదరాబాద్- శ్రీశైలం రహదారిపై వస్తుండగా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జియో పెట్రోల్ బంక్ వద్ద కడ్తాల్ వైపు నుంచి కందుకూరు వైపు వస్తున్న కారు ఎదురుగా వీరి బైక్ను ఢీ కొట్టగా ప్రమాదంలో తీవ్రగాయాలు కావడంతో సాత్విక్ రోథోడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి శిరీషకు రెండు కాళ్లు విరిగాయి. దేవేందర్, చిన్నకుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.