సిటీబ్యూరో, సెప్టెంబర్ 18/ కవాడిగూడ : వరదనీటిలో మునిగి ఓ వాహనదారుడు ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి వరద పోటెత్తి హైదరాబాద్ బల్కంపేట్ లోని రైల్వే అండర్ బ్రిడ్జి కింద చెరువులా మారింది. పోలీసుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ముషీరాబాద్ కవాడిగూడకు చెందిన మహ్మద్ షర్ఫుద్దీన్(26) బాలానగర్ లోని కృత్రిమ అవయవాల తయారీ కర్మాగారంలో పని చేస్తుంటాడు.
బుధవారం రాత్రి పని ముగించుకుని బాలానగర్ నుంచి తన స్కూటీపై ఇంటికి బయలుదేరాడు. జోరువానలో బల్కంపేట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద చెరువులా మారిన వరదనీటిలో ద్విచక్ర వాహనం గల్లంతై..నీటిలో మునిగిపోయాడు. ప్రతి రోజూ ఈ రైల్వే అండర్ బ్రిడ్జి కింద గుంపుగా వచ్చి పోలీసులు చలాన్లు వసూలు చేస్తుంటారని..వరదలప్పుడు పోలీసులు పత్తా లేకుండా పోయారని స్థానికులు తెలిపారు. పోలీసుల నిర్లక్ష్యం లేదని అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారని పోవద్దని వారించినా పట్టించుకోకుండా షర్ఫుద్దీన్ వెళ్లాడని ఇన్స్పక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు.