హిమాయత్ నగర్ మే 14: జేఈఈలో మంచి ర్యాంక్ రాలేదని తీవ్ర మనస్థాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణగూడ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బాల్యతండాకు చెందిన ధారావత్ ప్రవీణ్ కుమార్(20) ప్రస్తుతం నారాయణగూడలో ఓ హాస్టల్లో ఉంటూ.. జేఈఈ మెయిన్స్ కోసం ఢిల్లీకి సంబంధించిన అకాడమీ ద్వారా ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నాడు.
అయితే ఇప్పటికే రెండు సార్లు జేఈఈ మెయిన్స్ పరీక్ష రాసినా.. మంచి రాకపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. మంగళవారం తండ్రి రాందాస్ కుమారుడు ప్రవీణ్‌కు ఫోన్ చేసినా.. స్పందించలేదు. వెంటనే కుటుంబసభ్యులు బుధవారం ప్రవీణ్ ఉండే హాస్టల్‌కు వచ్చారు. లోపలి నుంచి గడియ పెట్టుకొని ఉండటంతో హాస్టల్ నిర్వాహకులతో గది తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా, ప్రవీణ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు. ఎస్సై షఫీ కేసు దర్యాప్తు చేస్తున్నారు.