బండ్లగూడ, జూన్ 2: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు (Suicide) పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్గూడా కేశవ్ నగర్ కాలనీలో నివాసముంటున్న చంద్రశేఖర్ (25) శుక్రవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం తల్లి డోరు తెరిచి చూసేసరికి చంద్రశేఖర్ ఉరేసుకొని కనిపించాడు. ఆమె అరుపులు కేకలు విన్న చుట్టుపక్కల ఉన్నవారు విచ్చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించారు. చంద్రశేఖర్ మృతికి గల కారణాలు ఇంకా తెలియవలసి ఉందని పోలీసులు తెలిపారు.