సిటీబ్యూరో, మే 20(నమస్తే తెలంగాణ): మీ ఫోన్ రెండు గంటల్లో బ్లాక్ అవుతుంది.. కస్టమర్ కేర్‌కు మీరు కనెక్ట్ అయి సమస్య తెలుసుకోవాలంటే 9 నంబర్ నొక్కండి.. అంటూ ఫోన్లు వస్తున్నాయి. 9 నంబర్ నొక్కగానే.. ఒక టోల్‌ఫ్రీ నంబర్‌కు కనెక్ట్ అవుతుంది.. మీ ఫోన్ నంబర్‌తో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి.. ఉత్తరప్రదేశ్ లక్నోలో మీపై కేసు నమోదయ్యిందంటూ చెబుతారు.. ఈ సమాచారం నిజమని నమ్మిన కొందరు భయపడుతున్నారు. మరికొందరు అనుమానం వచ్చి ఫేక్ అనుకుంటున్నారు. ఫెడెక్స్ కొరియర్లో డ్రగ్స్ సరఫరా అవుతుంటే మీ ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ దొరికింది.. మీపై మనీ లాండరింగ్ కేసు నమోదయ్యిందంటూ లక్షలు, కోట్ల రూపాయలు దోచేస్తున్న సైబర్నేరాళ్లు.. అదే మోసాన్ని ఇప్పుడు కొత్త తరహాలో మొదలు పెట్టారు. సైబర్‌నేరగాళ్లు ప్రతి రోజు వందల సంఖ్యలో ప్రజలకు కాల్స్ చేస్తూ మోసం చేసేందుకు స్కెచ్ వేస్తున్నారు. ఫోన్ లిఫ్టు చేయకపోతే వాట్సాప్ నంబర్‌కు యూపీ, ఢిల్లీకి చెందిన పోలీసు అధికారి ఫొటోను డీపీగా పెట్టి.. ఫోన్ నంబర్‌ను పంపిస్తున్నారు. ఈ లింక్‌ను క్లిక్ చేయండి.. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి.. ఈ వివరాలు చూసుకోండి.. అంటూ .ఏపీకే ఫైల్స్‌ను పంపిస్తున్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటంతో మీ ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశామని, మీపై మనీ లాండరింగ్ కేసు నమోదయ్యిందని భయపెడుతూ ఓ బాధితుడికి సైబర్‌నేరగాళ్లు ఫోన్ చేశారు. లక్నోలోని అలామ్బాగ్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. మీ ఫోన్ నంబర్, ఆధార్ కార్డుతో ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐలో బ్యాంకు ఖాతాలు తెరిచారు. అందులో మనీ లాండరింగ్ జరిగింది.. మీపై ఫెమ, ఎఫ్ఎంఎల్ఏ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయని, వెంటనే రూ. 3.05 లక్షలు డిపాజిట్ చేయాలని, లేదంటే అరెస్టు చేస్తామంటూ బెదిరించారు. దీనిపై అనుమానం వచ్చి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీఎస్‌లో కేసు నమోదైంది. ఇలాగే, రెండు రోజుల కిందట ఓ వ్యక్తికి వచ్చిన బెదిరింపు కాల్‌తో రూ.4 లక్షలు మోసపోయాడు. ఇటీవల ఈ కేసులు పెరుగుతున్నాయని, గుర్తుతెలియని వ్యక్తులు చేసే ఫోన్లకు బయపడవద్దని, అనుమానం ఉంటే వెంటనే తెలుపాలంటూ పోలీసులు సూచిస్తున్నారు.
పోలీసులు ఫోన్ చేశారు.. మనం మాట్లాడకపోతే ఇబ్బంది పెడుతారనే భయంతో కొందరు నిజమని నమ్మేస్తున్నారు. మీ ఫోన్ నంబర్ బ్లాక్ అవుతుందనే మెసేజ్‌లను సర్వీస్ ప్రొవైడర్లు పంపరు. ఒకవేళ అనుమానం ఉంటే, మీ సిమ్ కార్డుకు సంబంధించిన నెట్వర్క్ ప్రొవైడర్ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. గుర్తుతెలియని ఫోన్ నంబర్ల నుంచి వాట్సాప్ నంబర్‌కు వచ్చే మెసేజ్‌లు, వాట్సాప్ కాల్స్‌కు స్పందించ వద్దని పోలీసులు చెబుతున్నారు.