మేడ్చల్, ఏప్రిల్ 30:గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం… కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం నల్లమడుగుల తండాకు చెందిన ధనావత్ అర్చన(16) తన అన్నతో కలిసి మంగళవారం సాయంత్రం సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో టీజీఈఏపీసీఈటీ(ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) రాసేందుకు బైక్పై వచ్చింది. పరీక్ష రాసిన అనంతరం రాత్రి కండ్లకోయలో తన బంధువుల ఇంట్లో ఉండి, బుధవారం తెల్లవారుజామున అన్నతో కలిసి అర్చన తిరుగు పయనమైంది.
కండ్లకోయ నుంచి కామారెడ్డి వైపు 44వ నంబర్ జాతీయ రహదారిపై వెళ్తున్న క్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ పరిధి పారిశ్రామికవాడ వద్దకు రాగానే వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం అతివేగంగా వచ్చి వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అర్చన అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. మేడ్చల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అర్చన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.