కేపీహెచ్‌బీ కాలనీ, మే 12: తాను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకుందని కక్ష పెంచుకొన్న ఓ యువకుడు అమ్మాయి భర్తను అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన ఘటన కేపీహెచ్‌బీకాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని రాజమండ్రి దగ్గర కోరుకొండ మండలం ముళ్లగడ్డ గ్రామానికి చెందిన శ్రావణి సంధ్యకి ఏడున్నర సంవత్సరాల క్రితం కాళ్ల వెంకటరమణ తో వివాహం జరగగా వారు స ర్దార్ పటేల్ నగర్ కాలనీలో నివసిస్తున్నారు. కాగా 8 సంవత్సరాల క్రితం శ్రావణి సంధ్య పెళ్లి సంబంధాలు చూస్తున్న క్రమంలో వారి సమీప గ్రామంలో నివసిస్తూ డ్రైవర్‌గా పనిచేస్తున్న పంపెన అయ్యప్ప స్వామి ఆలియాస్ పవన్ కుమార్‌తో వివాహం చేయాలని అనుకున్నారు. కానీ పవన్ కుమార్ ప్రవర్తన సరిగా ఉండదని ఈ పెళ్లి వద్దని శ్రావణి సంధ్య తల్లిదండ్రులు నిరాకరించారు.
కొద్దిరోజుల క్రితం రాజమండ్రిలో జరిగిన వివాహ వేడుకలకు అక్కా ఉమామహేశ్వరి తో కలిసి వెళ్లగా శ్రావణి సంధ్య పవన్ కుమార్ కు కనిపించింది. తను ఇష్టపడ్డ అ మ్మాయి మరొకరితో కలిసి సుఖంగా ఉంటుందని కక్ష పెంచుకున్న పవన్‌కుమార్ శ్రావణి సంధ్య భర్త వెంకటరమణను చంపాలని అనుకున్నాడు. నెలరోజులుగా కేపీహెచ్‌బీకాలనీ, సర్దార్ పటేల్ నగర్ లో మకాం పెట్టాడు. తన సోదరుడు దుర్గాప్రసాద్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఇంటికి వెంకటరమణ రావడాన్ని గమనించాడు. ఆదివారం అర్ధరాత్రి దుర్గా ప్రసాద్ ఇంటికి వచ్చిన పవన్ కుమార్ ప్లాన్ ప్రకారం వెంట తెచ్చుకున్న కత్తితో వెంకటరమణ ఛాతిపై పొడిచి పారిపోయాడు. పవన్ కుమార్ తో పాటు మరో మరో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.