Rock Star Shriram Alluri | ఖండాంతరాలకు తెలుగు భాషను తీసుకెళ్లాలని.. రాక్ వెర్షన్లో ప్రపంచ దేశాలకు తెలుగు పాట వినిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు శ్రీరామ్ అల్లూరి. రాక్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. విశ్వ వేదికల మీద మెరుపులు మెరిపిస్తున్నాడు మన రాక్మారుడు!
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన శ్రీరామ్ అల్లూరికి బాల్యం నుంచీ నాన్న ప్రోత్సాహం ఉంది. అందుకే, బిడ్డకు చిన్న వయసులోనే వయోలిన్ కొనిచ్చారు. మంచి గురువును ఎంపిక చేసి.. ప్రాక్టీస్‌కు పంపారు. కానీ.. శ్రీరామ్ మనసు మాత్రం రాక్ సంగీతం వైపు లాగేది. తన పాట వినే శ్రోతలను ఉర్రూతలూగించాలని అనుకునేవాడు. అదే మాట తండ్రికి చెప్పాడు. ఆయనా కాదనలేదు. ఇన్స్టిట్యూట్ వాళ్లు ఇచ్చిన నోట్స్ ఫాలో అవుతూ ఇంటి దగ్గరే ప్రాక్టీస్ చేశాడు. అక్కడితో ఆగకుండా.. ఇంగ్లండ్ వెళ్లి మ్యూజిక్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ చేశాడు. ఆ తర్వాత ఫిన్లాండ్లో మాస్టర్స్ పూర్తి చేశాడు. ‘మ్యాన్ ఆఫ్ ట్రూత్’ అనే ఆల్బమ్ రూపొందించి యునైటెడ్ కింగ్డమ్లో ప్రదర్శించాడు. అనూహ్యమైన స్పందన వచ్చింది. ఆ ఉత్సాహం మరింత శక్తినిచ్చింది.
నాటింగ్‌హామ్, డెర్బీ, షెఫీల్డ్, మిలన్, పుణె, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్.. చాలా నగరాల్లో షోలు చేశాడు శ్రీరామ్. 2017లో కేంబ్రిడ్జి ఫోక్ ఫెస్టివల్లో పాల్గొనే అవకాశమూ వచ్చింది. గుండెలకు హత్తుకునేలా పాడి సత్తా చాటాడు. అందరూ తనను మెచ్చుకుంటున్నప్పుడు.. శ్రీరామ్ బుర్రలో ఒక ఆలోచన మెరిసింది. ‘తెలుగువాడిని, అందులోనూ హైదరాబాద్ వాడిని. నా మాతృభాషలో కాకుండా ఇంగ్లిష్‌లో ఎందుకు రాశాను? ఎందుకు పాడాను?’ అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా ‘ఓ కథ’ అనే తెలుగు ఆల్బమ్ రూపొందించాడు. ఈ ఆల్బమ్‌ను గ్రామీ అవార్డు గ్రహీత టొమాస్సో కొల్లివా రికార్డు చేయడం విశేషం. రికార్డింగ్ మొత్తం అయిపోయాక శ్రీరామ్‌ను పిలిపించుకొని ‘ఈ ఆల్బమ్ నీ దశ మార్చేస్తుంది డ్యూడ్?’ అని మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఫ్రాన్స్‌లో జరిగిన ట్రాన్స్ మ్యూజికల్ ఫెస్ట్, థాయిలాండ్‌లో జరిగిన ఎస్టోనియా మ్యూజిక్ వీక్, ఇండియన్ మ్యూజిక్ ఫెస్ట్‌లలో ప్రదర్శన ఇచ్చాడు. జనం ఊగిపోయారు. కరతాళధ్వనులు చేశారు.
మామూలుగా అయితే, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. కానీ.. శ్రీరామ్ మాత్రం ముందు రచ్చ గెలిచి.. ఇప్పుడు ఇంట గెలిచే ప్రయత్నం చేస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో స్వయంగా రాసి, పాడిన రాక్ పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇంగ్లిష్తో పోలిస్తే.. తెలుగులో రాక్ మ్యూజిక్కు ఆదరణ తక్కువ. అయితే.. శ్రీరామ్ మాత్రం ఎలాగైనా తెలుగువారికి రాక్ రుచి చూపించాలని అనుకుంటుకున్నాడు. కాబట్టే, లైవ్ మ్యూజిక్ షోలలో ఎక్కువగా సినిమా పాటలే పాడుతుంటారు. వాటికి ఆదరణ కూడా ఎక్కువే. అయితే.. రాక్ పరిచయం లేకపోవడం, ఎవరూ ప్రయత్నించకపోవడం వల్ల మ్యూజికల్ షో అంటే సినిమా పాటలే అని జనం ఫిక్స్ అయిపోయారు. ‘ఒకరకంగా చెప్పాలంటే సినిమా కంటే కూడా మ్యూజిక్ గొప్పది. సినిమా లేకపోయినా మ్యూజిక్ ఉంటుంది. కానీ.. మ్యూజిక్ లేకపోతే సినిమా లేదు’ అంటాడు శ్రీరామ్. ఈ మధ్యే తెలుగులో కూడా లైవ్ మ్యూజిక్‌ని ఎంజాయ్ చేస్తున్నారు జనం. ‘రాక్ మ్యూజిక్ జనాలకు అలవాటు కావాలంటే 80 శాతం సినిమా పాటలు ఉండాలి. 20 శాతం రాక్ మ్యుజీషియన్లు సొంతంగా రాసుకున్న, ట్యూన్ చేసుకున్న పాటలు ఉండాలి. ఎప్పటికైనా తెలుగు రాక్‌కు క్రేజ్ తీసుకురావాలి. అందుకోసం నా వంతు ప్రయత్నం చేస్తా ’ అంటున్నాడు శ్రీరామ్. ప్రస్తుతం తను మూడు ఆల్బమ్స్ చేస్తున్నాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్ సినిమా కోసం ఒక పాట కూడా రాశాడు. ఇంకొన్ని చర్చల దశలో ఉన్నాయి.
…? సుంకరి ప్రవీణ్ కుమార్
“Aksharavanam | కల్వకుర్తిలోని అక్షరవనం.. ఈ స్కూల్లో ఉపాధ్యాయులు.. హోంవర్క్‌లు ఉండవు..”