Aksharavanam
Aksharavanam | అక్కడ తరగతి గదులు ఉండవు. ఉపాధ్యాయుల (Teachers) చేతిలో బెత్తాలు కనిపించవు. అసలు ఉపాధ్యాయు (Teachers)లే ఉండరు. పుస్తకాల (Books) మోతలు నిషిద్ధం. హోంవర్క్ (Homework)ల ప్రస్తావనేలేదు. అయినా, విద్యార్థుల (Student)కు సమాజం నుంచి సాహిత్యం వరకు అన్ని విషయాల మీదా అవగాహన ఉంటుంది.
కల్వకుర్తి (Kalwakurthy)లోని అక్షరవనం (Aksharavanam) ప్రత్యేకత ఇది. సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ పబ్లిక్ సిస్టమ్ సంస్థ దేశవ్యాప్తంగా వినూత్న పద్ధతుల్లో బోధన సాగిస్తున్న 37 విద్యాసంస్థలను గుర్తించింది. అందులో అక్షరవనం (Aksharavanam) ఒకటి.
పదమూడేండ్ల క్రితం.. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘అక్షరవనం’ (Aksharavanam) ప్రాణం పోసుకుంది. జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారిపై కల్వకుర్తికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
వందేమాతరం ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు ఎడ్మ మాధవరెడ్డి తన పన్నెండు ఎకరాల వ్యవసాయ భూమిని అక్షరవనాని (Aksharavanam)కి ఇచ్చి.. నూతన విద్యా విధానంలో బోధనకు శ్రీకారం చుట్టారు.
తొలిదశలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు, అనాథలకు పాఠాలు చెప్పసాగారు. ‘కలాం 100’ పేరిట ప్రత్యేక బ్యాచ్‌లను ఏర్పాటుచేసి ఆంగ్లం, గణితంలో సానబట్టారు.
భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి, విలువలు వంటి అంశాలకు పెద్దపీట వేస్తూ కార్యక్రమాలు నిర్వహించారు. ఆ ప్రయోగం విజయ వంతమైంది. ఆ బ్యాచ్‌లో ఎంతోమంది ట్రిపుల్ ఐటీలకు ఎంపికయ్యారు.
ఏడేండ్ల క్రితం ఈ ఆవరణ.. విద్యా పరిశోధన కేంద్రంగా రూపాంతరం చెందింది. ఒత్తిడితో కూడిన చదువులు విద్యార్థులలో మానసిక సమస్యలను పెంచుతాయని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అక్షరవనం (Aksharavanam) తన దారి మార్చుకున్నది.
ఆ ఆవరణలో సరికొత్త కరికులమ్ ప్రారంభమైంది. ఇక్కడి విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడీ ఉండదు. వారికి వారే నేర్చుకుంటారు. అక్షరవనం (Aksharavanam) నివేదికల ఆధారంగానే.. ప్రభుత్వ బడులలో ప్రతి శనివారం ‘బాలబడి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అక్షరవనం (Aksharavanam)లో అరవై అయిదు మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ ఉపాధ్యాయులంటూ కనిపించరు.
సీనియర్, జూనియర్ విద్యార్థులు మాత్రమే ఉంటారు. ప్రత్యేకించి తరగతి గదులూ ఉండవు. ఎక్కడ సౌకర్యంగా ఉంటే.. అక్కడ కూర్చుని ఇంగ్లిష్, మ్యాథ్స్, హిందీ, తెలుగు.. ఇలా అన్ని సబ్జెక్టులు నేర్చుకుంటారు. పరీక్షల సమయంలో ప్రశ్న పత్రాలు విద్యార్థులే తయారు చేసుకుంటారు. మూల్యాంకన కూడా విద్యార్థులే చేస్తారు. అయినా ఎక్కడా వివక్ష ఉండదు.
ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు విద్యార్థులకు ఒక ప్రణాళిక ఉంటుంది. పిల్లల మధ్య పని విభజన ఉంటుంది. వంటావారు విద్యార్థులే చేస్తారు. వంతుల వారీగా రోజుకు ముగ్గురు చొప్పున కిచెన్ బాధ్యత చూసుకుంటారు.
చీపురుపట్టి పరిసరాలనూ శుభ్రం చేస్తారు. వ్యవసాయం, పాడి తామే చూసుకుంటారు. కూరగాయలు, పండ్లు పండిస్తారు. కోళ్లు, బాతులు, కుందేళ్లు పెంచుతారు.
అవసరమైతే షెడ్లూ వేసుకుంటారు. తెల్లవారు జామున ఐదు గంటల నుంచి రాత్రి 8.45 గంటల వరకు కచ్చితమైన టైమ్ టేబుల్ ఉంటుంది. ఆ ప్రకారమే పనులు జరుగుతాయి.
ఇందులో చదువుతోపాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య కథలు, దేశభక్తుల ఆత్మకథలు, దినపత్రికలు చదువుకుంటారు. ఇక్కడ అనాథలు, పేదలే కాదు.. ధనవంతుల పిల్లలు కూడా ఉంటారు.
ఉపాధ్యాయుల పిల్లలు పదిమంది వరకూ ఉంటారు. అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, పెద్దనాన్న, పెద్దమ్మ తదితర సంబోధనలు తప్పించి.. సార్, మేడమ్ వంటి పిలుపులు వినిపించవు. తరచూ పూర్వ విద్యార్థులు వస్తుంటారు. తమ సేవలను అందించి అక్షరాల రుణం తీర్చుకుంటారు.
‘భారతీయ విద్యా ఉత్సవ్’ పేరిట ఇటీవల ఇక్కడ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మూడురోజుల వేడుకలో 13 రాష్ర్టాలకు చెందిన 180 మంది పరిశీలకులు, విద్యావేత్తలు పాల్గొన్నారు.
ఒత్తిడితో కూడిన విద్య విద్యార్థులపై పెను ప్రభావాలను చూపిస్తుందని, చివరికి ఆత్మహత్యలకూ ప్రేరేపిస్తుందని విద్యా ఉత్సవ్‌లో విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు.