హైదరాబాద్, నవంబర్21 (నమస్తే తెలంగాణ): ‘స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లను 22 శాతానికి కుదిస్తూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. లేదంటే 2 కోట్ల మంది బీసీల నుంచి కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు. పార్టీ కోటా ఇస్తామనడం బీసీ వర్గాన్ని దగా చేయడమే’ అని అఖిలపక్ష నేతలు నిప్పులు చెరిగారు. ఎంపీ, తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో శుక్రవారం బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అధ్యక్షతన బీసీ, కుల, ఉద్యోగ, విద్యార్థి సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ కోటా తగ్గింపు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామన్న కాంగ్రెస్ 22 శాతానికి తగ్గించి బీసీలకు తీరని ద్రోహం చేసిందని ఆర్ కృష్ణయ్య ఘాటుగా విమర్శించారు. చట్టబద్ధ రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ఏడాదిగా చెప్పి, నేడు పార్టీపరంగా ఇస్తామని మాటమార్చడం దుర్మార్గమని, ఈ మోసానికి కాంగ్రెస్ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. 42% రిజర్వేషన్ల సాధనకు అవకాశం ఉన్నా ప్రభుత్వం తొలి నుంచే సరైన ప్రయత్నం చేయలేదని ధ్వజమెత్తారు. ఇండియా కూటమికి లోక్‌సభలో 240 మంది ఎంపీలు ఉన్నా.. ఈ విషయంపై ఒకరోజు కూడా ప్రశ్నించలేదని, ప్రధానిని కలిసి చర్చించనే లేదని విమర్శించారు.
రిజర్వేషన్ల కోసం బీసీలందరూ ఐక్యంగా ఉద్యమించాలని సినీనటుడు ఆర్ నారాయణమూర్తి పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల అంశంపై సీనియర్ అడ్వకేట్లను పెట్టి కోర్టులో వాదనలు వినిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 40 బీసీ సంఘాల తరపున ప్రముఖ అడ్వకేట్లను పెట్టాలని సూచించారు. కేసు వాదనలు సరిగ్గా వినిపిస్తే నూరు శాతం కేసు గెలుస్తుందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు.
సమావేశంలో ప్రముఖ సినీ దర్శకుడు శంకర్, నిర్మాత రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కో- ఆర్డినేటర్ డాక్టర్ ర్యాగ రిషి అరుణ్‌కుమార్, యాదవ సంఘం రాష్ట్ర అధ్యకుడు మేకల రాములుయాదవ్, మున్నూరుకాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య, పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాజ్‌కుమార్, ముదిరాజ్ సంఘం అధ్యకుడు శంకర్ ముదిరాజ్, పెరిక సంఘం అధ్యక్షుడు విజయకుమార్, గౌడసంఘం నాయకురాలు అనురాధగౌడ్, వంశరాజ్ సంఘం నేత మల్లేశం, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు లాలకోట వెంకటాచారి, ఎంబీసీ సంఘం అధ్యక్షుడు నిమ్మల వీరన్న, విద్యుత్తు ఉద్యోగుల సంఘం నేత కుమారస్వామి, కార్యదర్శి వెంకన్నగౌడ్, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నేత హనుమంత, ఉపాధ్యాయుల సంఘం అధ్యకుడు కృష్ణుడు, బీసీ పొలిటికల్ జేఏసీ నేత రాజు తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్లను 22శాతానికి తగ్గించి రాష్ట్రంలోని 2 కోట్లకు పైగా ఉన్న బీసీలను కాంగ్రెస్ అవమానపరిచిందని శాసనమండలి బీఆర్ఎస్ పక్షనేత సిరికొండ మధుసూదనాదారి విమర్శించారు. అందుకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. మార్చిలోగా ఎన్నికలు పూర్తి చేయకపోతే రూ.3 వేల కోట్లు వృథా అవుతాయని సీఎం పేర్కొనడం సిగ్గుచేటని మండిపడ్డారు. బడ్జెటు కంటే బీసీ రిజర్వేషన్ల అమలే ముఖ్యమని చెప్పారు. మార్చికి ఇంకా 4 నెలలు సమయం ఉన్నదని, హైకోర్టులోని కేసు నెలలోగా పూర్తవుతుందని వివరించారు. ఆలోగా అఖిలపక్ష పార్టీలతో కలిసి వెళ్లి ప్రధానితో చర్చలు జరిపి సమస్య పరిషారానికి చొరవ చూపొచ్చని తెలిపారు. కానీ, అవేవీ కాంగ్రెస్ సర్కార్ చేయకుండా మాటమార్చడం నయవంచక విధానాలకు నిదర్శమని నిప్పులు చెరిగారు.