Hyderabad | మాదాపూర్, ఫిబ్రవరి 17: ఆన్లైన్లో గేమ్‌లు ఆడుతూ డబ్బులు పోగొట్టుకోవడంతో ఓ యువకుడు ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం… తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సిరిసిపల్లి మోహన్ అరవింద్ కుమార్ (22) బతుకుతెరువు కోసం కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ వచ్చాడు. మాదాపూర్‌లోని ఖానామెట్‌కు వలస వచ్చి ఓ ప్రైవేట్ కంపెనీలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా ఆన్ లైన్ లో గేమ్ వ్యసనానికి అలవాటు పడ్డారు. రోజు అదే పనిగా ఆన్ లైన్ లో గేమ్ లు ఆడుతూ స్నేహితుల వద్ద అప్పులు చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఉన్న డబ్బులు కాస్త ఆన్ లైన్ గేమ్ లో పోగొట్టుకున్నాడు.
ఈ క్రమంలో మనస్తాపానికి గురైన యువకుడు ఆదివారం మధ్యాహ్నం 1: 31గంటలకు తాను నివాసం ఉంటున్న ఫ్లాట్‌లో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్ గేమ్‌లకు బానిసై దాదాపు రూ.2లక్షల వరకు పోగొట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.