వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ప్రధానాలయ ముఖ మండపంలో స్వామివారికి నిత్యకైంకర్యాల అనంతరం ధ్వజారోహణం వైభవంగా చేపట్టారు. స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి దేవతలను ఆహ్వానించడానికి గరుత్మంతుడిని వియుక్తం చేసే ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణానికి అర్చకులు, వేదపండితులు, రుత్వికులు, పారాయణదార్లు, యాజ్ఞికబృందం శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు ధ్వజారోహణ ఘట్టానికి ముందు ప్రధానాలయ వెలుపలి ప్రాకారంలోని అద్దాల మండపంలో యాగశాల ప్రవేశం, ద్వారతోరణ, ధ్వజకుంభారాధన, మహాకుంభారాధన, చతుస్థానార్చన నిర్వహించారు. అనంతరం అగ్నిప్రతిష్ఠ, మూలమంత్ర, మూర్తిమంత్ర హోమాలు గావించారు.
రెండో రోజు నిర్వహించిన ప్రధాన ఘట్టాలు..
భేరీపూజ, దేవతాహ్వానం..
స్వామివారి ప్రధానాలయంలో నిత్యారాధనల అనంతరం సాయంత్రం 6.30 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవనం కార్యక్రమాలను ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, అర్చక బృందం నిర్వహించారు. అష్టదిక్పాలకులను ఆహ్వానించేందుకు భేరీపూజ, దేవతాహ్వానం నిర్వహించారు. స్వామివారి సభాస్థానంలో స్వామివారిని పెండ్లికొడుకుగా ముస్తాబు చేసి 33 కోట్ల దేవతలు, 33 కోట్ల పితృదేవతలు, 33 రాగాలు, 33 తాళాలు, 33 వేదమంత్రాలతో భూలోకానికి ఆహ్వానించారు. దేవతలందరికీ స్వామివారి దివ్యవిమాన గోపురంలో వసతి సౌకర్యాలు, నైవేద్య కైంకర్యాలు అర్పించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి ఎన్.గీత, డీఈఓ దోర్బల భాస్కర్శర్మ, ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, యాజ్ఞికులు, ఉప ప్రధానార్చకులు, సహాయ కార్యనిర్వహణాధికారులు పాల్గొన్నారు.