సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలని ఎన్నికల ముందు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు ఇప్పుడు రాష్ట్ర ప్రజలను రాచిరంపాన పెడుతున్నారు. 15 నెలల పాలనలో నగరవాసులు పడుతున్న వెతలు వర్ణించలేనివి. కేసీఆర్ తన పదేళ్ల పాలనలో పేదవాడిచెంతకు ఉచిత వైద్యాన్ని తీసుకొచ్చి ఆరోగ్య తెలంగాణను నిర్మిస్తే, కాంగ్రెస్ పాలనలో వైద్యరంగం అనారోగ్యానికి గురవుతున్నది. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వ దవాఖానల్లో సేవలు దాదాపుగా నిలిచిపోయాయి. కేసీఆర్ పాలనలో వైద్యం చేసిన దవాఖానాలకు చేతులెత్తి మొక్కెటోళ్లు..కాంగ్రెస్ పుణ్యమా అని తిట్టుకుంటున్నరు.
హైదరాబాద్ జిల్లా పరిధిలో 91 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(యూపీహెచ్సీ) ఉన్నాయి. ఒక్కో యూపీహెచ్సీ సుమారు 10,000 మంది జనాభాకు వైద్యసేవలందించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 260 ఏఎన్ఎం సిబ్బంది, 1650 మంది ఆశ కార్యకర్తలు విధులు నిర్వహిస్తుండగా, ప్రస్తుతం ఇటీవల జరిగిన బదీలీల్లో 128 మంది ఏఎన్ఎంలు బదిలీపై ఇతర జిల్లాలకు వెళ్లారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా అధికారులు వదిలేశారు. 128 ఖాళీలకు గాను కేవలం 25 మందిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం చేసి ఉన్నవారిపైనే అదనపు పనిభారం మోపుతున్నారు. అంతేకాకుంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో మూడు యూపీహెచ్‌సీలకు కలిపి ఒక్కరే మెడికల్ ఆధికారి ఉంటూ వైద్యసేవలందిస్తుండటం గమనార్హం. ఇంకొందరు మెడికల్ అధికారులు ఉదయం పదకొండు గంట కొట్టేవరకు సెంటర్లకు చేరుకోరు. ఏన్ఎంలతోనే సగం చికిత్స చేయిస్తారు. డాక్టర్‌కోసం బాధితులు ఎదురుచూసి చేసేదేమిలేక వెనుతిరుగుతున్నారు.
బస్తీవాసులు, పేద ప్రజలకు సాధారణ ప్రసవాలు, 24 గంటలు వైద్యసేవలు అందుబాటులో ఉండే విధంగా కేసీఆర్ సర్కారు జిల్లాలోని 9 సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రసవాలకు కావాల్సిన పరికరాలు, ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. జిల్లాలోని బోరబండ, అరాజ్పెంట, పురానాపుల్-1, యాకత్పురా-1, దారుల్షిఫా, చార్మినార్, డాక్టర్ పాల్‌దాస్, గగన్ మహల్, బేగంపేట ప్రాంతాల్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సర్వీస్ సెంటర్లలో గతంలో ప్రసవాలు అనుకున్న స్థాయిలో జరుగుతుండేవి. పేదలకు వరంగా మారిన కేసీఆర్ కిట్ ప్రభుత్వ వైద్య సేవలను గుండెలకద్దుకునేలా చేసింది.
ఆ ప్రభావంతో ఆశలు నెలలో 6 వరకు ప్రసవాల కేసులు నమోదు చేయించి కేసీఆర్ కిట్‌ను అందించేవారు. కాంగ్రెస్ రాకతో కేసీఆర్ కిట్ పేరును మార్చి, ఎంసీహెచ్ కిట్‌గా పేరు మార్చింది. అధికారంలోకి వచ్చిన నాటినుంచి నేటి వరకు ఎంసీహెచ్ కిట్లు ఇవ్వకపోగా, ప్రసవాలు కూడా తగ్గడం గమనార్హం. సర్వీస్ సెంటర్ల లక్ష్యానికి తూట్లుపొడిచే దిశగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అడుగులువేస్తోంది. గతంలో మాదిరిగానే నెలలో డెలవరీల నమోదు టార్గెట్ ప్రకారం చేయాలని మెడికల్ అధికారులు ఆశలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వారికి చేదు అనుభవాలే ఎదురైతున్నాయి. ఎంసీహెచ్ కిట్ లేకపోవడం కారణంగా సర్వీస్ సెంటర్లకు వచ్చేందుకు బాధితులు అయిష్టంగా ఉన్నారు.