శేరి
లింగంపల్లి, జూలై 15 : టెక్నాలజీని అందిపుచ్చుకొని యువత నైపుణ్యాన్ని పెంపొందించుకున్నప్పుడే విజయాలు సొంతమవుతాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం(వరల్డ్ యూత్ స్కిల్స్ డే)ను పురస్కరించుకొని శనివారం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిలతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ టాస్క్ ఆధ్వర్యంలో వివిధ సంస్థల ద్వారా అందిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో శిక్షణ తీసుకొని స్థిరపడిన పలువురిని సన్మానించారు.
అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆపిల్, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ లాంటి సంస్థలకు సీఈఓలుగా నిలుస్తున్న వారిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నేడు హైదరాబాద్ నగరం ప్రపంచవ్యాప్తంగా ఐటీకి నిలయంగా మారిందంటే సీఎం కేసీఆర్ విజన్, మంత్రి కేటీఆర్ నైపుణ్యమే కారణమని చెప్పారు. దేశంలో బెంగళూర్, ముంబై నగరాలు ఐటీకి తలమానికంగా నిలిస్తే నేడు వాటన్నింటినీ దాటి తెలంగాణ రాష్ట్రం ఐటీలో దూసుకెళ్తున్నదని తెలిపారు. ప్రపంచ పేరొందిన దిగ్గజ వ్యాపార సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు పోటీపడుతున్నాయని చెప్పారు. వినూత్న ఆలోచనలతో టీ-హబ్‌ను ఏర్పాటు చేసిన మంత్రి కేటీఆర్ కృషి ఇందుకు ప్రధాన కారణమన్నారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ తీసుకుంటున్న అనేక సంస్కరణలతో మహిళల్లో అవగాహన చైతన్యం పెరిగిందని, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో అధికంగా రాణిస్తున్నారని వివరించారు. చదువుల్లో పాస్ పర్సంటేజీలు ముఖ్యం కాదని యువత టెక్నాలజీ ఆధారిత నైపుణ్యాన్ని అందింపుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దీపక్ ఆనంద్, రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాపారవేత్త కృష్ణమాచార్య శ్రీకాంత్, రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి రాణీ కుముదిని, బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ ఒవెన్, టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హాలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో ఉపాధి అవకాశాలు మెరుగు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాకముందు ఇక్కడ ఉన్నత చదువులు పూర్తి చేసుకొని యువత ఉపాధి కోసం దుబాయ్ లాంటి ఇతర దేశాలకు వలస వెళ్లేవారని మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నేడు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో అనేక స్కిల్ డెవలప్మెంట్ సంస్థలను ఏర్పాటు చేసి ఆ పరిస్థితిని మార్చివేశారని చెప్పారు. ఇతర దేశాల నుంచి హైదరాబాద్ నగరానికి పెట్టుబడి, ఉపాధి అవకాశాల కోసం క్యూ కడుతున్నారని వెల్లడించారు. పదో తరగతి, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు సైతం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులతో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని వివరించారు. తెలంగాణ రాకముందు ఒక మహబూబ్‌నగర్ నుంచి 14 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారని తెలిపారు. నేడు మంత్రి కేటీఆర్ చొరవతో ఐటీ టవర్ ఏర్పాటుతో 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు అందిస్తున్నామన్నారు.
నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి : చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి
మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధిలో నెలకొన్న గ్యాప్‌ను దూరం చేసేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలకు సరిపడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. టాస్క్ లాంటి స్కిల్ డెవలప్మెంట్ సంస్థలను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతను ఉపాధి అవకాశాల దిశగా తీర్చిదిద్దుతున్నదని చెప్పారు.