Kidney Day | సుల్తాన్ బజార్, మార్చి 13 : భారతదేశంలో కిడ్నీ వ్యాధి చాలా సాధారణమైందని, ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల మంది కిడ్నీ వైఫల్యానికి గురవుతున్నారని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ సహాయ్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా దవాఖాన నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ మనీషా సహాయ్ నేతృత్వంలో ప్రజా అవగాహన వాక్, కిడ్నీ క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ప్రజా అవగాహన వాక్‌ను, కిడ్నీ క్విజ్ పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవగాహనరాహిత్యం వలన ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల వరకు రోగులు ఇన్ని వైఫల్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. రోగులు మూత్రపిండాల వైఫల్యానికి గురైతే డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడిని చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో ప్రతి నెల 3500 మంది రోగులకు డయాలసిస్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా ఆస్పత్రి నెఫ్రాలజీ ఆధ్వర్యంలో 800 మంది రోగులకు విజయవంతంగా కిడ్నీ మార్పిడిని నిర్వహించడం జరిగిందన్నారు. ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.
నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ మనీషా సహాయ్ మాట్లాడుతూ.. మూత్రపిండల వ్యాధికి మధుమేహం, అధిక రక్తపోటు, నొప్పి నివారణ మందులను, స్థానిక ఔషధాలను వాడటం, వృద్ధుల వయస్సు, మూత్రపిండాల్లో రాళ్లు, ఊబకాయం వంటివి ప్రమాద కారకంగా నిలుస్తున్నాయన్నారు. మూత్రపిండాల వ్యాధికి ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు కానీ ముందుగా పరీక్షలు నిర్వహించుకొని గుర్తించడం ఎంతో ఉత్తమమని ఆమె అన్నారు. మూత్రపిండాల పనితీరును అంచనా వేయడానికి యూరిన్ ఆల్బుమిన్, క్రియాటినైన్ రక్త సాధారణ పరీక్షలను నిర్వహించి తెలుసుకోవచ్చు అన్నా రు. చికిత్సకు ముందుగా గుర్తించడం ఎంతో ముఖ్యమని అని ఆమె వివరించారు. ఆరోగ్యకరమైన జీవనం అంటే నిత్యం ఒక అర టీ స్పూన్ కంటే తక్కువ ఉప్పు, అర లీటర్ కంటే తక్కువ నూనె తీసుకోవడంతో పాటు ఎర్ర మాంసం తినకుండా ఉండడం ఎంతో మంచిదన్నారు. నిత్యం 6 నుంచి 8 లీటర్ల నీటిని సేవించడం, నడవడం, రోజుకు 7 గంటల పాటు నిద్రపోవడం, తాజా కూరగాయలను తీసుకోవడం, చక్కెర, రక్తపోటు నియంత్రణతో చాలావరకు మూత్రపిండాల వ్యాధిని నివారించడంలో దోహదపడుతుందన్నారు. అందరికీ కిడ్నీ వైఫల్యంపై అవగాహన కల్పించడమే తమ ప్రధాన నినాదమని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దవఖాన ఆర్ఎంవో డాక్టర్ జయకృష్ణ, ఆర్ఎంవోలు డాక్టర్ కవిత, డాక్టర్ రఫీ, డాక్టర్ సిద్ధిఖీ, డాక్టర్ విజయ భాస్కర్‌తో పాటు ఎంబీబీఎస్ విద్యార్థులు, ఇంటర్న్ విద్యార్థులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.