విశ్వనగరం దేవుడెరుగు.. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో నగరాభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. మహానగర అభివృద్ధిలో కీలకపాత్రను పోషించే హెచ్ఎండీఏలో ప్రాజెక్టుల పురోగతి లేకుండా పోయింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులన్నీ హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయం దాటడం లేదు. నార్త్ సిటీ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించేలా రూపొందించిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు బాలారిష్టాలను ఎదుర్కొంటుంది. కొత్వాల్ గూడ ఎకో పార్క్ పెండింగ్ పనులు సాగుతూనే ఉన్నాయి. మీరాలం చెరువు కేబుల్ బ్రిడ్జిని మూసీకి డెవలప్మెంట్కు అప్పగించి చేతులు దులుపుకొన్నారు. రేడియల్ రింగు రోడ్డుల నిర్మాణానికి రెండు టెండర్లు పిలువగా.. మిగిలిన రోడ్లకు దిక్కు లేకుండా పోయింది. స్కై వాక్ వేల నిర్మాణం అతీగతీ లేకుండా పోయింది. ట్యాంక్ బండ్ పరిసరాలను విదేశీ తరహా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ప్రణాళికలు అధ్యయనాలకే పరిమితమయ్యాయి. కాంగ్రెస్ నిర్లక్ష్యం.. నగరానికి శాపంగా మారింది.
-సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): 11 జిల్లాలకు విస్తరించిన హెచ్ఎండీఏ నగరంలో మౌలిక వసతుల కల్పన, ప్రణాళిక, నిర్మాణ పనులకు బాధ్యత వహిస్తోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడంలో ప్రధాన పాత్రను పోషించిన హెచ్ఎండీఏ గడిచిన రెండేళ్లలో జాడ్యం నెలకొని ఉంది. కొత్త ప్రాజెక్టులు ఎలాగు పట్టాలెక్కడం లేదు. కనీసం పాత ప్రాజెక్టులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు రూ. 5వేల కోట్ల పనులకు పైగా హెచ్ఎండీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ప్రధానంగా ఎలివేటెడ్ కారిడార్, గ్రీన్ ఫీల్డ్ హైవే, నూతన లింకు రోడ్ల నిర్మాణం, మీరాలం లేక్ బ్యూటిఫికేషన్, హుస్సేస్ సాగర్ ఆధునీకరణ, స్కై వాక్ వేలను దాదాపు రూ. 21వేల కోట్లతో ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ ఇందులో కనీసం పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ. 100 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. బీఆర్ఎస్ చేపట్టిన కొత్వాల్‌గూడ ఎకో పార్క్, హెచ్ఎండీఏ పరిధిలో లింకు రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు పనులు తప్ప.. ఏ ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా కార్యరూపంలోకి దాల్చలేదు.
ఏటా రూ. 1500 కోట్లపైనే..
హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే హెచ్ఎండీఏ గడిచిన పదేళ్లలో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించింది. ఎకరం వంద కోట్లకు హెచ్ఎండీఏ డెవలప్ చేసిన కోకాపేట్ నియోపోలిస్ వెంచర్‌ను రూ. 250 కోట్ల డెవలప్ చేసి ఆ భూములను విక్రయించింది. దీంతో దేశంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులను నగరానికి ఆకర్షించింది. అదే విధంగా ట్యాంక్ బండ్ సుందరీకరణ, కొత్వాల్ గూడ ఎకో పార్క్ నిర్మాణం, ఓఆర్ఆర్ వెంబడి సోలార్ సైకిల్ ట్రాక్, రేడియల్, లింకు రోడ్ల నిర్మాణం, ఇలా గడిచిన పదేళ్లలో సగటున ఏటా రూ. 1500 కోట్లకు పైగా నిధులను నగర అభివృద్ధికి ఖర్చు చేసింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్త ప్రాజెక్టులకు ప్రతిపాదనలే తప్ప..కార్యరూపంలోకి వచ్చింది లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఇక మీరాలం చెరువు మీద కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తామని, అందుకు అనుగుణంగా నిధులు ఖర్చు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఈ ప్రాజెక్టును మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు అప్పగించి చేతులు దులుపుకొన్నారు. అదే విధంగా రూ. 5వేల కోట్ల అంచనా వ్యయంతో దేశంలోనే రెండో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించడానికి గత ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ కాంగ్రెస్ పాలనలో ఉన్న ప్రాజెక్టును డిజైన్లు మార్చి.. ప్రాజెక్టును నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఈ రెండేళ్లలో కనీసం భూసేకరణ కూడా పూర్తి కాలేదు.
రెండేళ్లలో శంకుస్థాపనలు, ప్రతిపాదనలే..
రెండేళ్ల కాంగ్రెస్ పాలన తీరుకు నిదర్శనంగా ఇప్పటివరకు వేసిన శంకుస్థాపనలు, రూపొందించే ప్రతిపాదనలే హెచ్ఎండీఏలో దర్శనమిస్తున్నాయి. కనీసం శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులైన కార్యరూపంలోకి వచ్చాయంటే అదీ లేదు. దీనికి ఉదాహరణగా నిలిచే ఎలివేటెడ్ కారిడార్ నిలుస్తోంది. ఆ తర్వాతి జాబితాలో నిలిచిన ఫ్యూచర్ సిటీ మీదుగా నిర్మించనున్న ట్రిపులార్‌ను అనుసంధానం చేసే గ్రీన్ ఫీల్డ్ హైవేలు నిలుస్తాయి. తొలి గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టుగా శంకుస్థాపన చేస్తే ఇప్పటివరకు భూసేకరణ కూడా పూర్తి కాలేదు.
మెట్రో విస్తరణకు అనుమతులే రాలే..
నగరంలో ప్రస్తుతం 69 కిలోమీటర్ల మేర మెట్రో అందుబాటులో ఉంది. అధికారంలోకి రావడంతోనే మెట్రో విస్తరణ చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో 32 కిలోమీటర్ల పొడవైన రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో మార్గానికి గత ప్రభుతం టెండర్లు ఖరారు చేసి, భూసేకరణ మొదలుపెట్టింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్రాజెక్టుతో ప్రయోజనమే లేదని రద్దు చేసింది. నగరానికి పెట్టుబడులు తీసుకువచ్చే ఐటీ కారిడార్ మీదుగా ఎయిర్‌పోర్టు మెట్రోకు వెళ్లాల్సిన మెట్రోను రెసిడెన్షియల్ ఏరియాలు విస్తరించి ఉన్న ప్రాంతాలైన ఉప్పల్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట మీదుగా మార్పు చేశారు.
ఇక ఓల్డ్ సిటీ మెట్రో బీఆర్ఎస్ వల్లనే పూర్తి కాలేదని ఆరోపించిన సర్కారు.. రూ. 3వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టి ఏడాది గడిచిన భూసేకరణ పూర్తి చేయలేదు. అదే విధంగా కీలకమైన 45కిలోమీటర్ల పొడవైన నార్త్ సిటీ మెట్రో విస్తరణకు అనుమతులు రాక ప్రాజెక్టు నీరుగారిపోతుంటే… జనసంచారమే లేని భారత్ ఫ్యూచర్ సిటీకి మెట్రోను పరుగులు పెట్టించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అత్యంత ఆసక్తితో ఈ ప్రాజెక్టు కోసం పరితపిస్తున్నారు. అయినా కేంద్రంలోని బీజేపీ జనసంచారమే మెట్రో అనుమతులకు కీలకమనీ తేల్చి చెప్పి…ఇప్పటివరకు పెట్టిన రూ. 45వేల కోట్ల మెట్రో ప్రాజెక్టును కొట్టుమిట్టాడుతుంది. దీంతో నగరంలో మెట్రో విస్తరణ ఆగమ్యగోచరంగా మారింది.