కార్వాన్ నియోజకవర్గంలోని జియాగూడ స్లాటర్ హౌస్ ( కమేళా)లో జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం తీసుకున్న నిర్ణయం ఉద్రిక్తతకు దారి తీసింది. మేకలు వధించరాదంటూ అధికారులు స్లాటర్ హౌస్‌ను సీజ్ చేయడంతో 5 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వెంటనే తెరిచి తమకు జీవనోపాధి కల్పించాలని లేదంటే చావే శరణ్యమంటూ చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో పాటు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకుని కార్మికులు, వ్యాపారులు నిరసన తెలిపారు. అంతకు ముందు ఆరెకటిక సంఘం నాయకులు మిత్ర కృష్ణ, మొండేదార్ కమిటీ సభ్యులు నర్సింగరావు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను కలిసి మార్కెట్‌ను తిరిగి ప్రారంభించాలంటూ వినతిపత్రం సమర్పించారు. ఆందోళన చేస్తున్న వీరికి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్చార్జి కార్తీక్ రెడ్డి, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో పాటు కార్వాన్ బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కమేళాకు చేరుకొని ఆరె కటిక, చిరు కార్మికులకు మద్దతు తెలిపారు.

సిటీబ్యూరో/కార్వాన్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ ) : కమేళాలో మేకలను వధించిన అనంతరం మేక తలకాయ, కార్జం, బోటి, కాళ్లు, బేజా( వీటిని సౌదే లేదా సౌదలుగా పిలుస్తారు) వంటి వాటిని స్థానికంగా నివసించే పేద కుటుంబాల వారు ముఖ్యంగా ఆరె కటికలు మేకల వధ అనంతరం ఈ సౌదలను నీటితో శుభ్రం చేసి మార్కెట్లో కావాల్సిన వారికి విక్రయిస్తూ తమ జీవనాన్ని సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా స్థానికంగా అపరిశుభ్రతతో పాటు దుర్గంధం ఏర్పడుతుందని పేర్కొంటూ జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు ఈ నెల 2న స్లాటర్ హౌస్ గేటుకు తాళం వేసి సీజ్ చేశారు. ఈ క్రమంలో గత వారం రోజులుగా తమకు జీవనాధారం లేక ఆకలితో అలమటిస్తున్నామంటే ఈ సౌదలు అమ్మే మహిళలు, ఆరె కటికలు, చిరు వ్యాపారులు కమేళాలో ఆందోళన చేపట్టారు.
సీల్‌ను పగులగొట్టిన ఎంఐఎం ఎమ్మెల్యే
జియాగూడ కమేళాలోని స్లాటర్ హౌస్‌కు జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు తాళం వేసిన కారణంగా తమ జీవనోపాధి కోల్పోయామంటూ స్థానిక వ్యాపారులు ఆందోళనకు దిగిన విషయం తెలుసుకున్న కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ తన అనుచరులు, కమేళాలోని వ్యాపారులు, ఆరె కటిక ప్రతినిధులతో కలిసి స్లాటర్ హౌస్‌కు ప్రభుత్వ అధికారులు వేసిన సీల్‌ను పగులగొట్టి స్థానిక వ్యాపారులతో కలిసి లోపలికి వెళ్లారు. అయితే ప్రభుత్వ అధికారులు వేసిన సీల్‌ను ఇలా ఒక ఎమ్మెల్యే నిబంధనలకు విరుద్దంగా ఎలా వ్యవహరిస్తారని సీల్‌ను పగులగొట్టడం ప్రభుత్వ నియమ నిబంధనలను అతిక్రమించడమేనని పలువురు ఆరోపిస్తుండగా స్థానిక వ్యాపారులు మాత్రం ఎమ్మెల్యే చర్యను వెనుకేసుకు వచ్చారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఐదు వేల కుటుంబాలు రోడ్డుపాలు

ఆరె కటికెలు, గొల్ల కురుమలు, ముస్లిం మైనార్టీలకు ఉపాధి కల్పించే జియాగూడ మేకల మండిని మూసేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వేల కుటుంబాలను రోడ్డున పడేసిందని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్‌రెడ్డి అన్నారు. జీవాలను కోయడం వల్ల వచ్చే వ్యర్థాల వల్ల మూసీ నది కలుషితమవుతున్నదనే నెపంతో జియాగూడ మండిని మూసేయడాన్ని నిరసిస్తూ మంగళవారం నిర్వాహకులు ఆందోళన బాట పట్టారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేత కార్తీక్‌రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జియాగూడ మండి నిజాం కాలం నుంచి ఇక్కడ కొనసాగుతూ నగరం మొత్తానికి నాణ్యమైన మాంసాన్ని సరఫరా చేస్తున్నారని అన్నారు.
దశాబ్దాలుగా ఇక్కడి జీవాల నుంచి వచ్చే వ్యర్థాలతో కలుషితం కాని మూసీ ఇప్పుడే అవుతుందా? అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ అధికారులకు మూసీ కాలుష్యం ఇప్పుడే గుర్తొచ్చిందా? అని నిలదీశారు. ముందు పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్య కారకాలను కట్టడి చేయాలని.. పరిశ్రమలను ముందుగా మూసేయాలని హితవు పలికారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా మండి స్థలాన్ని కాజేసేందుకే కాలుష్యం పేరిట మూసేశారని ఆరోపించారు. మాంసం విక్రయిస్తూ ప్రత్యక్షంగా 5 వేల కుటుంబాలు, పరోక్షంగా 15 వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారని.. కాంగ్రెస్ సర్కారు తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఇప్పుడు వారంతా రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలను రోడ్డున పడేసి బడా వ్యాపార సంస్థలను నెలకొల్పేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. ఆకస్మిక నిర్ణయాలతో పేద ప్రజలను రోడ్డున పడేస్తున్న ముఖ్యమంత్రికి బుద్ధి ఉందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి..
జియాగూడ మండి ద్వారా ప్రభుత్వానికి రూ.200 కోట్ల ఆదాయం వస్తుందని… ఇలా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే వనరులను కొల్లగొడుతుంటే ఖజానాలోకి డబ్బులెలా వస్తాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడటమే కాకుండా చిన్న చిన్న వ్యాపారులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న ప్రజలు రోడ్డున పడుతున్నారని అన్నారు. ఇక్కడ మార్కెట్‌ను మూసేయడం కంటే ముందు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నవారికి మరోచోట స్థలం, వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.ఆదివారంలోగా మండిని తిరిగి ప్రారంభించకుంటే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించి మహాధర్నా చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదు.
ఇల్లు గడవడం కష్టంగా మారింది
నేను కమేళాలో 20 ఏండ్లుగా బోటి అమ్ముకొని జీవనం సాగిస్తూ నా పిల్లలను చదివిస్తూ బతుకు వెళ్లదీస్తున్నాం. స్లాటర్ హౌస్‌లో మేకల వధ వల్ల వాటి నుంచి వచ్చే బోటి, కార్జం వంటి వాటిని శుభ్రం చేసి విక్రయించి ఎంతో కొంత సంపాదించి బతుకుతున్నాం. వారం రోజులుగా బంద్ కారణంగా ఇల్లు గడవడవ కష్టంగా మారింది. చిరువ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దు.
– రాణి బాయి, బోటి విక్రేత
పేదలపై పగబట్టిన రేవంత్ సర్కార్
జియాగూడలోని స్లాటర్ హౌస్ వల్ల నేను నా కుటుంబం 23 ఏండ్లుగా బతుకుతున్నాం. మేకలను వధించిన తర్వాత దాని నుంచి లభించే బోటి, కార్జం, కాళ్లు, తలకాయ లాంటి వాటిని కాల్చి నీటితో శుభ్రం చేసి విక్రయిస్తాం. వచ్చే సంపాదన వల్ల మా కుటుంబాలు నడుస్తునాయి. స్లాటర్ హౌస్‌ను తెరవనివ్వకపోతే తాము ఎలా బతకాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై పగ బట్టింది.
– పద్మ, సౌదల విక్రేత
ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాడుతాం
మండిని తిరిగి ప్రారంభించేదాకా నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తాం. బీఆర్ఎస్ పార్టీ జియాగూడ మండి నిర్వాహకులు, కూలీల పక్షాన పోరాటాలు కొనసాగిస్తుంది. జియాగూడ, పరిసర బస్తీల ప్రజలంతా కలిసి ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి గొల్ల కురుమలు జీవాలు ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. అధికారులు దిగి రాకుంటే జీహెచ్ఎంసీ కార్యాలయం ముందే మండిని ప్రారంభించి కొనసాగిస్తాం.
– జీవన్ సింగ్, బీఆర్ఎస్ కార్వాన్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి
నోటికాడి కూడును లాక్కుంటారా..
30 సంవత్సరాల నుంచి మండిలో పనిచేసుకుంటూ ఉపాధి పొందుతున్నాం. రోజంతా ఇక్కడ పనిచేస్తే రూ.400 నుంచి రూ.500 కూలీ వస్తుంది. అద్దె ఇండ్లలో ఉంటూ ఇక్కడ పనిచేసుకుని బతుకుతున్నాం. ఇప్పుడు మార్కెట్‌ను మూసేయడంతో మా కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. జియాగూడ మండి మీదనే ఆధారపడి నలుగురు పిల్లలను సాదుకుంటున్నాం. ఈ పని తప్పితే మాకు మరే పని రాదు. ఇప్పుడు ఎక్కడికి పోయి బతకాలి. ఏం పనిచేసి బతకాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
– అనితాబాయి, జియాగూడ కమేలా
కుటుంబమంతా రోడ్డున పడ్డాం
పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారుల నుంచి మాంసం కొనుగోలు చేసి అమ్ముకుని ఉపాధి పొందుతున్నా. రోజంతా పనిచేస్తే రూ.500 దాకా వస్తుంది. ఇప్పుడు వారం నుంచి మండి బంద్ చేశారు. నా కుటుంబం రోడ్డున పడ్డది. నాభర్తకు ఒక చేయి పడిపోయింది. ఆయనకు పింఛన్‌కూడా రావడం లేదు. నాతో మండిలో ఉంటూ నాకు సాయంగ చిన్న చిన్న పనులు చేస్తారు. మాకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మండి బంద్ అయితే వారిని, నా భర్తను ఎలా పోషించుకోవాలి?. ప్రభుత్వం పేదలను హించిచడం సరికాదు.
– గీత, జియాగూడ