కుత్బుల్లాపూర్, జూన్ 3 : నిబంధనలకు విరుద్ధంగా పురాతన గోడను కూల్చివేస్తుండగా కార్మికుడు శిథిలాల కింద ఇరుక్కుని 11 గంటలు నరకయాతన పడ్డాడు. ఈ సంఘటన జీడిమెట్ల డివిజన్ పరిధి శ్రీనిలయ ఎంక్లేవ్ సాయిరాం బృందావన్ అపార్ట్మెంట్లో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, తోటి కార్మికులు తెలిసిన వివరాల ప్రకారం… మహబూబాబాద్ జిల్లా పూర్వి మండలం నేరేడు గ్రామశివారు కాకులబోడ తండాకు చెందిన బానోత్ రెడ్డి(35) బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి కుత్బుల్లాపూర్ సర్కిల్ పద్మానగర్ ఫేస్-2 రింగ్‌రోడ్ సమీపంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు.
అడ్డాపై రోజూవారికూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోశించుకుంటున్నాడు. కాగా గత 13 ఏండ్ల కిందట జీడిమెట్ల డివిజన్ శ్రీనిలయ ఎంక్లేవ్ సాయిరాం బృందావన్ అపార్ట్మెంట్ నిర్మించారు. గోడకు పగుళ్లు రావడంతో దాన్ని తీసేసి.. రిటైనింగ్ గోడను రాడ్లతో నిర్మించాలని అపార్ల్‌మెంట్ అసోసియేషన్ కమిటీ సభ్యులు పూనుకున్నారు. ఇందులో భాగంగా లేబర్ అడ్డాపై పనిచేసే బానోత్‌రెడ్డి, గణేశ్, ఎల్లయ్య, కుమార్, రాజును తీసుకువచ్చి పనులు చేయిస్తున్నారు.
సోమవారం డ్రిల్లింగ్ మిషన్‌తో తవ్వకాలు చేపట్టడంతో దానికి ఆనుకొని ఉన్న గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. పునాధిలో ఉన్న బానోత్రెడ్డిపై శిథిలాలు పడటంతో అందులోనే ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్, మున్సిపల్, పోలీస్ యంత్రాంగం, ఆరోగ్య సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని శిథిలాల కింద ఇరుక్కుపోయిన బానోత్‌రెడ్డిని ఎలాంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా బయటకు తీశారు. కాగా డీసీ నర్సింహ ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీసులు అసోసియేషన్ కమిటీ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విజయ్‌వర్ధన్ తెలిపారు.
ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున సెల్లార్ల తవ్వకాలు, మరమ్మతులు చేపట్టరాదని నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ సంబంధిత అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులు ఇష్టానుసారంగా మరమ్మతులు చేపట్టారు. దీనిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.