చిక్కడపల్లి, జూలై 11: బాగ్లింగంపల్లి శ్రీరామ్ నగర్లో ఓ వ్యక్తి బంగారు ఆభరణాలతో ఉన్న పర్సును శుక్రవారం చిక్కడపల్లి పోలీసులకు అందించి తన నిజాయితీని చాటుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తూ బిహెచ్ఐఎల్ నివాసముంటున్న ఎస్.నందిని కుమారి బాగ్లింగంపల్లి శ్రీరామ్ నగర్లో నివాసముంటున్న తన చెల్లెలు నిర్వహిస్తున్న పూజలో పాల్గొనేందుకు భర్తతో కలిసి వచ్చింది.
అదే సమయంలో తనకారులో నుంచి దిగుతుండగా చేతిలో 8 తులాల బంగారు ఆభరణాలతో ఉన్న పర్సు కనిపించలేదు. వెంటనే విషయాన్ని చిక్కడపల్లి పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు కేసును నమోదు చేసుకుని సీసీఫుటేజీలతో పాటు ఇతర అన్ని రకాలుగా విచారణ చేపట్టారు. కానీ, ఎటువంటి పురోగతి కనిపించలేదు. ఇదే సమయంలో రాంనగర్ ప్రాంతానికి చెందిన లేబర్ పనిచేసే పి.శివకుమార్ మహిళ పోగొట్టుకున్న పర్సు లభించింది. వెంటనే దీనిని చిక్కడపల్లి పోలీసులకు అందించారు.
పర్సు లభించిన సమాచారాన్ని బాధితురాలికి అందించారు. స్వచ్చందంగా బంగారు ఆభరణాలతో ఉన్న పర్సును నిజాయితీతో ఇచ్చిన శివకుమార్ ను చిక్కడపల్లి ఏసీపీ ఎల్.రమే కుమార్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజూనాయక్, డిఐ శంకర్, ఎస్ఐ మౌనిక తదితరులు పాల్గొన్నారు.