బండ్లగూడ, నవంబర్ 26: ఓ భవనం నిర్మాణంలో పని చేస్తున్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. దీంతో మృతుడి తల్లి, భార్య పిల్లలు రోడ్డున పడ్డారు. మధ్యవర్తులు అతడి ప్రాణానికి వెల కట్టి చేతులు దులుపుకున్నారు. దీంతో వారు కన్నీరుమున్నీరై పోలీస్‌స్టేషన్‌లో రోదిస్తూ కనిపించారు. ఏం జరిగిందని వారిని కదిలించగా.. అసలు విషయం తెలిసింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ్‌పేట్ జిల్లా దామరగిద్ద మండలం కనుకుర్తి గ్రామానికి చెందిన నర్సింహలు(28), సంతోష దంపతులు.
వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పదేళ్ల కిందట కాళీమందిర్ ప్రాంతానికి వలస వచ్చి స్థానికంగా కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. కాగా, నర్సింహలు సోమవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని భవానీ కాలనీలో ఓ భవనం నిర్మాణంలో పని వెళ్లాడు. గోవా కట్టెలు కడుతుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. దీంతో స్థానికులు ఓ ఆస్పత్రికి తరలించగా.. అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నర్సింహులు మృతి చెందడంతో ప్రమాదం జరిగిన ఇంటి యజమాని తరఫున మధ్యవర్తులు రంగంలోకి దిగారు. మృతుడి కుటుంబీకులను మభ్యపెట్టి పలు దఫాలుగా చర్చలు జరిపి రూ.6లక్ష 50వేలకు ఒప్పించారు. ఇందులో భాగంగానే కొంత నగదు మంగళవారం చెల్లించి మిగతాది పలు దఫాలుగా చెల్లించేందుకు ఒప్పించినట్లు మృతుడి కుటుంబీకులు తెలిపారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న నర్సింహలు మృతి చెందడంతో మంగళవారం రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ ఆవరణంలో అతడి భార్య, తల్లీపిల్లలు, కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు.