సిటీబ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా గ్రేటర్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాజేంద్రనగర్లో అత్యధికంగా 4.65 సెం.మీ లు, బహుదూర్పురాలోని చందూలాల్ బారాదరిలో 4.53 సెం.మీలు, శాస్త్రీపురంలో 4.15 సెం.మీలు చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వానలు, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ క్రమంలో నగరానికి రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీచేశారు. కాగా, గురువారం భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఐటీ కంపెనీలకు తమ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం కేటాయించాల్సిందిగా సైబరాబాద్ పోలీసులు సూచించారు.