సిటీ బ్యూరో, నవంబర్ 8(నమస్తే తెలంగాణ) : మహిళా శక్తి.. ఇందిరమ్మ రాజ్యం… మహిళా ప్రభుత్వం అంటూ తెలంగాణ ఆడబిడ్డలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వారిని అన్నివిధాలుగా మోసం చేసింది. ఎన్నికల ముందు ఆడబిడ్డలను అందలమెక్కించి అధికారంలోకి వచ్చారు. తెలంగాణ మహిళలను కోటీశ్వరులను చేస్తామని హామీల వర్షం కురిపించారు. ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో జీవించేలా పాలన సాగిస్తామని ప్రగల్భాలు పలికారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లవుతున్నా వారికిచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా నమ్మకద్రోహం చేశారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకూ రూ.2,500 పింఛన్ ఇస్తామన్నారు. చదువుకునే ఆడపిల్లలందరికీ ఉచితంగా స్కూటీలు పంపిణీ చేస్తామని చెప్పారు.
ఉచిత బస్సు ప్రయాణం పేరిట వారిలో వారికే గొడవలు పెట్టించడం తప్పితే రెండేండ్లలో కాంగ్రెస్ మహిళలకు చేసిందేమీ లేదు. పదేండ్ల నుంచి కేసీఆర్ మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. గర్భిణులకు కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉండేందుకు కావలసిన పోషకాలు అందించేలా చొరవ తీసుకున్నారు. తెలంగాణ ఆత్మగౌరవ పండుగ బతుకమ్మకు చీరలు అందజేశారు. కానీ మహిళలను కోటీశ్వరులను చేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ఏమీ చేయకపోగా కేసీఆర్ ఇచ్చిన పథకాలను అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపివేశారు. ఆడబిడ్డలకు కాంగ్రెస్ చేసిన మోసాలకు ప్రతీకారంగా జూబ్లీహిల్స్‌లో ఓడించి బుద్ధి చెప్తామని శపథం చేస్తున్నారు.
వడ్డీ తిరిగి చెల్లిస్తామంటూ గొప్పలు
మహిళలందరినీ కోటీశ్వరులను చేస్తామని కాంగ్రెస్ హామీల వర్షం కురిపించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలకు వడ్డీ తిరిగి చెల్లిస్తామని ప్రకటించారు. మహిళా సాధికారత కోసం లోన్లు ఇస్తామని చెప్పారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులంతా వచ్చి జూబ్లీహిల్స్‌లో మీటింగ్ పెట్టి మరీ చెప్పారు. వడ్డీ చెల్లింపులు ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్లు పైలట్ ప్రాజెక్టుగా పేర్కొన్నారు. మహిళలందరినీ పిలిచి ఓ చెక్కును కూడా శాంపిల్‌గా ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉండటంతో ఇక్కడ హడావుడిగా కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలందరినీ కోటీశ్వరులను చేస్తాం.. జూబ్లీహిల్స్ నుంచి శ్రీకారం చుడుతున్నామని మంత్రులంతా గప్పాలు కొట్టారు. కానీ నాటి నుంచి నేటిదాకా వడ్డీ చెల్లింపుల్లో కానీ.. లోన్ల మంజూరులో కానీ ఎలాంటి పురోగతి లేదు. రాష్ట్రంలో ఎక్కడా దాని ఊసే లేదు. ఆదిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మంత్రుల మాటలన్నీ నీళ్ల మూటలని తేలిపోయాయి.
స్కూటీలు లేవు.. రూ.2,500 పింఛను లేదు
మహిళా సాధికారతే కాంగ్రెస్ లక్ష్యమంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ వారికి నమ్మక ద్రోహం చేసింది. ఓట్లేయించుకుని గెలిచినాక వారి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. చదువుకుంటున్న ఆడబిడ్డలందరికీ మహాలక్ష్మీ పథకం కింద స్కూటీలు పంపిణీ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఆ పథకాన్నే ప్రారంభించలేదు. 18 ఏండ్లు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు రూ.2500 పింఛను ఇస్తామని హామీ ఇచ్చి గాలికొదిలేశారు. కేసీఆర్ బతుకమ్మ పండుగకు ప్రతి మహిళకు ఒక్కొక్క చీర పంపిణీ చేస్తే.. తాము అధికారంలోకి వస్తే అత్యంత ఖరీదైన రెండు చీరలు ఇస్తామని గొప్పలు చెప్పారు. రెండు కాదు కదా ఒక్కటి కూడా ఇవ్వలేదు. జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక జరుగుతుండటంతో కొంతమంది మహిళా సంఘాల్లోని సభ్యులకు మాత్రం ఇందిరమ్మ చీరలంటూ బతుకమ్మ పేరు తీసేసి.. నామమాత్రంగా పంపిణీ చేసి చేతులు దులుపుకొన్నారు. మహిళలను అన్ని విధాలుగా నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌ను ఓడించి బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే వారి మోసాలను కొనసాగిస్తారని, ఓడిస్తేనే రేవంత్‌రెడ్డికి బుద్ధి వస్తుందని మండిపడుతున్నారు.