సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : నగరంలోని పలు కాలనీల్లో మహిళా స్వయం సహాయక సంఘాలతో ఓటరు అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ.. లా కాలేజీ, కూరగాయల మార్కెట్, బ్యాంక్‌లలో స్వీప్ కార్యక్రమాలను నిర్వహించారు. మెట్టుగూడ సీతాఫల్ మండి, రాంనగర్ కూరగాయల మార్కెట్, పడాల రాంరెడ్డి లా కాలేజీ, యూసుఫ్‌గూడ, తార్నాకలో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు.
చార్మినార్ జోన్ కార్యాలయంలో సెక్టార్ ఆఫీసర్ బీఎల్వో, సూపర్వైజర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓటర్ టర్న్ ఔట్, అన్ని పోలింగ్ కేంద్రాల వారీగా పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, అందుకు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్లమ్, మార్కెట్లకు వెళ్లి ఓటరు అవగాహన కార్యక్రమాలను ముమ్మరంగా చేయాలని జోనల్ కమిషనర్ వెంకన్న సూచించారు.