హిమాయత్‌నగర్,మే12: మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని పలు మహిళా సంఘాల నేతలు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య, రాష్ట్ర అధ్యక్షుడు జి.అనసూయ, ఎన్ ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.జ్యోతి మాట్లాడారు.
బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని ఆరోపించారు. పోక్సో చట్టం ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాల్సింది పోయి నిందితుడికి సమాచారం ఇచ్చి బాధితురాలపైనే కేసులు పెట్టడమంటే పోలీసు అధికారులు బాదితుల పట్ల ఎలాంటి వైఖరిని అవలంభించారో స్పష్టంగా కన్పిస్తుందన్నారు.
నింధితుడు సాయి భగీరథ్‌ను పోలీసులు అరెస్ట్ చేయకుండా జాప్యం చేస్తున్నారంటే కేసును నీరుగార్చడంలో భాగమేనని ఆరోపించారు.17 ఏండ్ల అమ్మాయిపైన హనీట్రాప్ కేసు పెట్టడం చట్ట విరుద్ధమన్నారు. బాధితురాలికి ఆమె కుటుంబ సభ్యులకు రక్షణ కల్పిం చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఈ ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో సత్వరమే న్యాయ విచారణ జరిపించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలు మహిళా సంఘాల నేతలు జి.ఝాన్సీ, ఎస్.వరలక్ష్మి, స్వరూప,లక్ష్మి,జి.భారతి,హేమలత,బి.జ్యోతి పాల్గొన్నారు.