హయత్నగర్, సెప్టెంబర్ 16 : రోడ్డు దాటుతున్న ఓ మహిళను మినీ లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన హయత్నగర్ పీఎస్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హయత్నగర్ డివిజన్ సత్యానగర్ కాలనీలో తన్నీరు నాగరాణి(42), భర్త వెంకట నర్సింహ, పిల్లలతో కలిసి నివాసముంటున్నారు. ఇటీవల ఏపీ సింగరాయకొండలోని పుట్టింటికి వెళ్లిన నాగరాణి శుక్రవారం ఉదయం హైదరాబాద్కు వచ్చి హయత్నగర్లో బస్సు దిగింది.
కుంట్లూర్ చౌరస్తాలో రోడ్డు దాటుతుండగా ఎల్బీనగర్ నుంచి విజయవాడ వైపు అతివేగంగా దూసుకొచ్చిన మినీ లారీ నాగరాణిని ఢీకొట్టింది. ఈ ఘటనలో కిందపడ్డ ఆమె తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కుమారుడు తన్నీరు కార్తీక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.